ప్రచార హోరుకు తెర

05 December, 2018 - 6:19 PM

(న్యూ వేవ్స్ బ్యూరో)

హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం సాయంత్రం 5 గంటలతో హోరాహోరీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అభ్యర్థులు, నేతల బహిరంగ సభల నిర్వహణపై నిషేధం అమలులోకి వచ్చింది. సభలు, ఊరేగింపులు, సినిమా, టీవీ మాధ్యమాల్లో సైతం ప్రచారంపై ఆంక్షలు విధించారు. తెలంగాణలో డిసెంబర్ 7న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందుకోసం ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. 7న ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. కాగా, బరిలో మొత్తం 1821 మంది అభ్యర్థులు  తమ గెలుపోటములను పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడతాయి.

రాష్ట్రవ్యాప్తంగా 32815 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 3873, వనపర్తిలో 280 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల కోసం 1,60,509 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.

పోలింగ్ కోసం 55,329 బ్యాలెట్‌ యూనిట్లు, 42,751 వీవీప్యాట్‌‌లు,  39,763 కంట్రోల్‌ యూనిట్లను వినియోగిస్తున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం 279 కేంద్ర కంపెనీల బలగాలను పంపారు.