తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

14 September, 2018 - 4:19 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రధానాధికారి రజత్‌‌కుమార్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంతృప్తి చెందాకే నిర్ణయం ఉంటుందని, నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం రజత్ కుమార్ మీడియాతో మాట్లాడారు.

జిల్లాల కలెక్టర్లు, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమం చేపడుతున్నామని రజత్ కుమార్ అన్నారు. ఈ నెల 15, 16వ తేదీల్లో గ్రామస్థాయిలో పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తున్నామన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సీఈసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని రజత్‌‌కుమార్‌ చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి వస్తారని రజత్ కుమార్ అన్నారు. ఓటరు నమోదుకు సమయం సరిపోదని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డాయని, అయితే గత అనుభవాల దృష్ట్యా సమయం సరిపోతుందని సీఈసీ పేర్కొందని చెప్పారు. ఈవీఎంలలో సెక్యూరిటీ ఫీచర్స్‌ ఉన్నాయని, ఏ ఈవీఎం ఎక్కడకు వెళ్లేది చివరి నిమిషం వరకూ తెలియదని రజత్ కుమార్ చెప్పారు. వివిప్యాట్‌ మిషన్లను కొత్తగా ప్రవేశపెడుతున్నామని, ఈనెల 18లోగా ఈవీఎంలు, వివిప్యాట్‌‌లు జిల్లాలకు చేరాల్సి ఉందన్నారు. ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు నాలుగు రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు.

సీఈసీ ప్రతినిధుల భేటీలో శాంతిభద్రతలను సమీక్షించారని, బూత్‌‌ల వారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు అధికారులు ప్రణాళిక ఇచ్చారన్నారు. ఓటరు జాబితా, మెటీరియల్‌, సిబ్బందిని సిద్ధం చేస్తున్నామని, ఓటరు జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందచేస్తామన్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లకు బూత్‌ లెవెల్‌ అధికారులు వెళతారన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల ముసాయిదా జాబితా సవరణ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో ఉన్న అభ్యంతరాలను పరిష్కరిస్తామని చెప్పారు.

ఓటర్లకు నగదు పంపిణీపై నిఘా పెడతామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారంపై వచ్చే కథనాలపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

కాగా.. ఏడు జిల్లాలను నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలుగా ఈసీ గుర్తించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ఖర్చుపై నిఘా ఉంటుందన్నారు. హెల్ప్‌ డెస్క్‌‌లు ఏర్పాటు చేసి కాల్‌ డెస్క్‌‌కు 30 లైన్లను అనుసంధానం చేస్తామన్నారు.