చంద్రన్నకి ‘కానుక’

13 May, 2019 - 7:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: చంద్రబాబు.. కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఈ కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. అసలు అయితే.. మంగళవారం ఉదయం ఈ భేటీ జరగాల్సి ఉంది. కానీ ఈ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సాయంత్రం అనుమతి ఇవ్వడంతో.. కేబినెట్ భేటీ మంగళవారం మధ్యాహ్నం మొదలుకానుందని తెలుస్తోంది.

ఎన్నిలక కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఏటువంటి భేటీలు నిర్వహించరాదని ఎన్నికల సంఘం స్పష్టమైన హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ వేళ సమీక్షలు, సమావేశాలు నిర్వహించాలంటే.. 48 గంటల ముందు లేఖ రాయాలనీ ఈసీ స్పష్టంగా పేర్కొంది.

ఆ క్రమంలో దీనికి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నమే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ.. నాలుగు అంశాలతో కూడిన నోట్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. దాంతో ఈ కేబినెట్ సమావేశానికి అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం నాలుగు అంశాలు.. కరవు, ఫొని తుపాను, తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకం నీధులపై అత్యవసర చర్చను ఈ కేబినెట్ సమీక్షలో సమీక్షించనున్నారు.

అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ప్రధాని మోదీ.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సైతం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు పలుమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఒకానొక సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నతాధికారులతో సమీక్ష ఏర్పాటు చేయగా… ఆ సమీక్షకు ఉన్నతాధికారులు డుమ్మా కొట్టారు.

ఆ తర్వాత ఫొని తుపాన్ రావడం… ఆ ప్రభావం ఉత్తరాంధ్రలో స్పష్టంగా కనిపించడంతో ఉన్నతాధికారుల సమీక్షించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. దాంతో మంత్రి సోమిరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.