‘ఎన్నికల వాయిదా కొనసాగించాలి’

18 March, 2020 - 6:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అలాగే ఎన్నికలపై తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని కూడా  సుప్రీంకోర్టు సూచించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై బుధవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పైనా విచారణ చేపట్టిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి.. ఎన్నికలు వాయిదా సహా ఏ అంశమైనా ఎన్నికల సంఘానిదే అధికారమని జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశాల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. దీనిలో కొంత మినహాయింపు అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. అందులోభాగంగా ఎన్నికల నిర్వహణ తేదీలు ప్రకటించే వరకు ప్రవర్తనా నియమావళిలో కొన్ని మార్పులు చేస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే కొత్తగా ఎటువంటి పథకాలు చేపట్టవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.

పాత పథకాలనే కొనసాగించాలి కానీ కొత్తగా ఏటువంటి పథకాలకు శ్రీకారం చుట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘమే చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎన్నికలపై తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు సూచించింది.