ద్యుతీ సోల్‌మేట్ దొరికింది!

20 May, 2019 - 1:00 AM

(న్యూవేవ్స్ డెస్క్)

భువనేశ్వర్‌ (ఒడిశా): స్నేహితురాలితో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ భారత స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ సంచలన ప్రకటన చేసింది. దాంతో తాను కూడా స్వలింగ సంపర్కురాలిననే విషయం బహిర్గతం చేసిన తొలి భారత అథ్లెట్‌గా నిలిచింది. ఒడిశాలోని తన స్వగ్రామానికి చెందిన ఓ అమ్మాయితో జీవితాన్ని పంచుకుంటానని పేర్కొన్న ద్యుతీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతానికి ఆమె వివరాలు వెల్లడించలేనని చెప్పింది.

ద్యుతి మాట్లాడుతూ.. ‘నా సోల్‌మేట్‌ను కనుగొన్నా. తమకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే, వారితో జీవితాన్ని పంచుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. స్వలింగ సంపర్కుల హక్కులు కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా. ప్రేమను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది (సెక్షన్‌ 377ను ఉద్దేశించి). అథ్లెట్‌ అయినంత మాత్రాన నా నిర్ణయాన్ని ఎవరూ జడ్జ్‌ చేయాల్సిన అవసరంలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా. గత పదేళ్లుగా స్ప్రింటర్‌గా భారత్‌కు ఎన్నో విజయాలు అందించా. మరో ఐదేళ్ల వరకూ రాణిస్తాననే నమ్మకం ఉంది. నా క్రీడా ప్రయాణానికి సహకరిస్తూ.. జీవితాంతం తోడుండే వ్యక్తిని ఎంచుకున్నా. ప్రస్తుతం వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, ఒలింపిక్‌ క్రీడలపై దృష్టి సారించా. క్రీడల నుంచి విరామం తీసుకున్న తర్వాత పూర్తి సమయం నా సోల్‌మేట్‌కే కేటాయించి, జీవితంలో స్థిరపడాలనుకుంటున్నా అని ద్యుతీ చంద్ పేర్కొంది.

ఇలా ఉండగా.. ద్యుతి చంద్లో పురుష లక్షణాలున్నాయంటే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తీవ్రంగా కలత చెందిన ఈ ఒడిశా అథ్లెట్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులో పోరాడి గెలిచింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజత పతకాలు సాధంచిన విషయం తెలిసిందే.