మందు కొట్టిన యువతి..రోడ్డుపై హంగామా

17 January, 2018 - 11:20 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టింది. బ్రీత్ ఎలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా వారికి చుక్కలు చూపింది. మంగళవారం అర్థరా​త్రి జూబ్లీహిల్స్ పరిధిలో ఆరు చోట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో ఓ యువతి మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తుండగా పోలీసులు ఆమె కారును ఆపారు. మద్యం తాగిన పర్సెంటేజీ ఎక్కువగా ఉండడంతో సదరు యువతి..రోడ్డుపైనే పరుగులు తీసి పారిపోయేందుకు ప్రయత్నించింది. తనకు పెద్దవాళ్ళు చాలామంది తెలుసునంటూ వారికి ఫోన్ చేస్తానని బెదిరిస్తూ.. దుర్భాషలకు దిగింది.

ఈ క్రమంలో పోలీసులతో యువతి వాగ్వాదానికి దిది.. కొద్దిసేపు వీరంగం సృష్టించింది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా ఇబ్బంది పెట్టింది. తాగిన పర్సంటేజ్ ఎక్కువ ఉండటంతో పారిపోయే యత్నించి పోలీసులకు చుక్కలు చూపించింది. పారిపోతున్న ఆ యువతిని ట్రాఫిక్ పోలీసులు వెంబడించి పట్టుకుని కేసు నమోదు చేశారు.

మరోవైపు అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 79 మంది మందు బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 34 కార్లు, 25 బైక్‌లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు.