ఆసీస్‌ జట్టుపై తక్కువ అంచనా వద్దు

11 January, 2019 - 5:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: ఆస్ట్రేలియా జట్టును తక్కువగా అంచనా వేయొద్దని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే సూచించాడు. ఆసీస్‌తో జరిగే మూడు వన్డేల సీరీస్‌ కోసం విరాట్ టీమ్ ఎక్కువగా సాధన చేయాలని కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా- భారత జట్ల మధ్య మూడు వన్డేల సీరీస్‌ శనివారం నుంచి ప్రారంభం అవుతుంది.

‘చారిత్రక టెస్టు సీరీస్‌ గెలిచిన టీమిండియాపై మరో బాధ్యత కూడా ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు బలహీనంగా ఉంది. అలా అని వారిని తేలిగ్గా తీసుకోలేం. మనం మన ప్రయత్నం చేయాలి. వన్డేలకు ఇంకాస్త సమయం దొరికితే బాగుండేంది. అంతే కాకుండా క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకునే ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. అలా అని వారిని, వారి ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉందని తక్కువగా అంచనా వేస్తే మనం బలం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే రిషబ్‌ పంత్‌‌ను మూడు ఫార్మాట్లలోనూ తీసుకోవాలి. ఇప్పుడు కోహ్లీ సేన వేసే ప్రతి అడుగు ముఖ్యమైనదే. ప్రతి మ్యాచ్‌ ప్రపంచకప్‌‌కు ఉపయోగపడుతుంది’ అని కుంబ్లే అన్నాడు.

ధోనీ కొన్ని మ్యాచ్‌‌ల్లో విఫలమైనంత మాత్రాన అతడి ప్రతిభను పూర్తిగా పక్కన పెట్టి మాట్లాడటం సరికాదని కుంబ్లే అన్నాడు. ప్రపంచ కప్‌‌లో ధోనీకి స్థానం ఉంటుందని ఆశిస్తున్నా. ఇదే మాట కొద్ది రోజుల క్రితం చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నా. ధోనీ సామర్థ్యం గురించి అందరికీ తెలుసు. దేశానికి ప్రపంచకప్ సాధించి పెట్టిన ఘనత ధోనీది. ధోనీ మీద విమర్శలు చేయడం కూడా మానుకోవాలని కుంబ్లే అన్నాడు.