ట్రంప్- కిమ్ చారిత్రక భేటీ విజయవంతం..!

12 June, 2018 - 1:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సింగపూర్‌: ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తిగా వీక్షిస్తుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చారిత్రక సమావేశం విజయవంతం అయింది. ఈ చారిత్రక ఘట్టం సింగపూర్‌లో ఆవిష్కృతమైంది.ఈ భేటీకి సింగపూర్‌‌లోని కేపెల్లా హోటల్‌ వేదిక అయింది. ట్రంప్‌- కిమ్‌ దాదాపు 40 నిమిషాల పాటు ముఖాముఖి భేటీ అయ్యారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతి స్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకాంశాలు వారిద్దరి మధ్యా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి కిమ్‌ను తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పిన ట్రంప్… ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ వెంటనే మొదలవుతుందని ప్రకటించారు. అంచనాలకు మించి తమ భేటీ జరిగిందని చెప్పారు. ఏ ఒప్పందంపై సంతకాలు జరిగాయని జర్నలిస్టులు ప్రశ్నించగా… త్వరలోనే తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ… ప్రపంచం పెద్ద మార్పును చూస్తుందని, తాను సమగ్ర ఒప్పందంపై సంతకం చేశానని తెలిపారు.

కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ భేటీ సానుకూల ఫలితాలు ఇస్తుందని ఇరు దేశాధినేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక భేటీలో తొలిసారి కలిసిన ట్రంప్‌-కిమ్‌ ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. మొదట దుబాసీల సాయంతో ట్రంప్‌-కిమ్‌ ఏకాంత ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు.సమావేవం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘కిమ్‌‌ జరిగిన ఈ భేటీ వెరీ వెరీ గుడ్‌’ అని పేర్కొన్నారు. ఈ సమావేశం పూర్తిస్థాయిలో విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘చాలా సానుకూలంగా ఈ భేటీ జరిగింది. అందరూ ఊహించిన దాని కంటే అద్భుతంగా జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ సమావేశం ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుంది’ అని ట్రంప్‌ అన్నారు. తాము ఇరువురం పెద్ద సమస్యను, పెద్ద సందిగ్ధాన్ని పరిష్కరించినట్టు చెప్పారు. కలిసి పనిచేస్తూ.. కలిసి సమస్యలు పరిష్కరించుకుంటామని ఆయన తెలిపారు.

‘శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముతున్న’ట్లు కిమ్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నో అడ్డంకుల తర్వాత ఈ సింగపూర్‌ భేటీ సాకారమైందని ఎన్నో సంశయాలు, ఊహాజనితాలను ఈ భేటీతో అధిగమించామని పేర్కొన్నారు.

తొలిసారిగా కలుసుకున్న సందర్భంగా ట్రంప్‌- కిమ్‌ కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ చాలాసేపు చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తర్వాత తమ జాతీయ జెండాల వద్ద నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం ట్రంప్‌.. హాలువైపు కిమ్‌‌కు దారి చూపించారు.

1950-53 కొరియా యుద్ధం అనంతరం అమెరికా, ఉత్తరకొరియా శత్రు దేశాలుగా మారాయి. ఈ రెండు దేశాధ్యక్షుల మధ్య చర్చలు ఇంతవరకూ జరగలేదు. కనీసం ఫోన్‌‌లో కూడా నేతలు మాట్లాడుకోలేదు. తొలిసారిగా ఇప్పుడు ఇరు దేశాధినేతలు భేటీ కావడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇరు దేశాధినేతలు పరస్పర సహకారం, అనుబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.అంతకు ముందు.. ఏకాంత ముఖాముఖి భేటీకి ముందు ట్రంప్‌ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ‘మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది’ అని కిమ్‌ అంటే.. కిమ్‌‌తో తన భేటీ అద్భుతమైన విజయం సాధిస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘నాకు ఎంతో గొప్పగా ఉంది. మన సమావేశం నిజంగా ఫలప్రదం కాబోతుందని నేను భావిస్తున్నాను. మన మధ్య టెర్రిఫిక్‌ రిలేషన్‌ (అద్భుతమైన అనుబంధం) నెలకొనబోతోంది. ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు’ అని కిమ్‌‌తో ట్రంప్ పేర్కొన్నారు.

కిమ్‌ స్పందిస్తూ.. ‘ఇంతవరకు రావడం మామూలు విషయం కాదు. మన ముందు గతం ఎన్నో అడ్డంకులు ఉంచింది. కానీ వాటన్నింటినీ అధిగమించి మనం ఈ రోజు ఇక్కడివరకు వచ్చాం’ అన్నారు. మొదట ఇరువురు నేతలు కొంత అప్రమత్తతతో ముభావంగా ఉన్నట్టు కనిపించినా.. ఆ తర్వాత కాస్త హుషారుగా పరస్పరం స్నేహపూర్వకంగా కలిసిపోయారు. అయితే, అణ్వాయుధాలు ప్రధాన అంశంగా జరిగిన వీరి భేటీలో ఎలాంటి ఫలితం వచ్చిందనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.

కాగా.. ఇటీవలి వరకు ట్రంప్‌, కిమ్‌‌ ఒకరిపై ఒకరు దూషణ భాషణలు, ఒకరి మీద ఒకరు అణ్వస్త్రాలు కురిపిస్తామని బెదిరించుకున్న విషయం తెలిసిందే. అయితే.. అంతలోనే వాతావరణం చల్లబడి, ఇద్దరూ చర్చలకు కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు. అందుకే ప్రపంచమంతా సింగపూర్‌ భేటీవైపు ఆసక్తిగా చూసింది.