బాలుడి నోట్లో 526 పళ్ళు!

31 July, 2019 - 9:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: సాధారణంగా ఎవరి నోట్లో అయినా 32 పళ్ళు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ చెన్నైకి చెందిన ఓ ఏడేళ్ల బాలుడి నోట్లో మాత్రం ఏకంగా 526 పళ్ళున్నాయి. ఆ బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆ దంతాలను బాలుడి నోటి నుంచి తొలగించారు.

ఆ బాలుడి తల్లిదండ్రులు అతనికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే దవడ వాచి ఉండటాన్ని గమనించారు. అయితే.. అది అప్పుడు చిన్నగానే ఉండటంతో వారు అంతగా పట్టించుకోలేదు. ఆ బాలుడు కూడా వాపును చూపించడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దవడ వాపు పెద్దదవుతూ వచ్చింది. దీంతో అతని తల్లిదండ్రులు బాలుడిని చెన్నైలోని సవిత డెంటల్‌ కాలేజ్‌కు తీసుకెళ్లారు.

ఆ బాలుడికి దవడ ఎందుకు వాచిందో తెలుసుకోవడానికి వైద్యులు ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ చేశారు. ఆ తర్వాత బాలుడి కుడి దవడ కింద భాగంలో సంచి మాదిరిగా ఉబ్బి ఉండటాన్ని గమనించారు. శస్త్రచికిత్స ద్వారా ఆ సంచిని తొలగించేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ దవడ భాగంలో దాగి ఉన్న దంతాలను వైద్యులు బయటకు తీశారు. మొత్తం 200 గ్రాముల బరువున్న 526 దంతాలను వైద్యులు గుర్తించారు. ఈ దంతాలు వివిధ సైజుల్లో ఉన్నట్టు తెలిపారు.

శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సవిత డెంటల్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ ప్రతిభ రమణి తెలిపారు. ప్రపంచంలో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారి అని వైద్యులు చెప్పారు.