కారణాలు చెప్పిన వర్మ

26 May, 2019 - 7:39 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం తెరకెక్కించడానికి మహానటుడు ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఏం జరిగిందో చెప్పడానికి అని అత్యంత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశారు. ఈ చిత్రం మే 31న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకానుందన్నారు. ఆదివారం విజయవాడలో వర్మ విలేకర్లతో మాట్లాడుతూ… తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని.. కావాలని ఈ మూవీని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

ఈ ఎన్నికల ఫలితాల్లో సైకిల్ టైర్‌ పంక్చర్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. తనను బెజవాడలో అడుగు పెట్టకుండా చేసేందుకు ఒకరు ఫోన్‌లో ఆర్డర్ వేశారని… అదీ ఎవరనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని పాత్ర దారులు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఈ సినిమా ఇక్కడ విడుదలకు ముందే చంద్రబాబుకు శిక్ష పడిందన్నారు. చంద్రబాబుని నమ్మి.. ఎన్టీఆర్ తప్పు చేశారన్నారు. ఎన్టీఆర్‌ను కష్టాలకు గురి చేసిన వ్యక్తికి ప్రజాకోర్టులో శిక్ష పడిందని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీ ఓటమికి ముఖ్య కారణాలు… వెన్నుపోట్లు, అబద్దాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, వైయస్ జగన్ మోహన్ రెడ్డి, లోకేశ్ అని స్పష్టంగా చెప్పారు.