ఆర్టికల్ 370 రద్దుపై ఎవరేమన్నాంటే..

05 August, 2019 - 11:45 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ విభజన బిల్లును రాజ్యసభ సోమవారం ఆమోదంచింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేసే చారిత్రాత్మక బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. దీనిపై వాడీవేడిగా చర్చ, హోంమంత్రి వివరణ అనంతరం ఓటింగ్‌ నిర్వహించారు. ఈ బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు.. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో ఢిల్లీ మాదిరిగా అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడ్డాయి.

ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదంపై పలువురి అభిప్రాయాలు ఇవీ..:

జమ్మూ కశ్మర్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రక్తపాతానికి కారణమైన ఆర్టికల్ 370 పరిసమాప్తమైందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని గుర్తుచేసుకోవాల్సిన క్షణాలివని అన్నారు. ఆర్టికల్ 370 కారణంగా ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయో ఆనాడే చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఆర్టికల్‌ 370 రద్దు సంతోషకరమైన విషయం అని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇది ఓ గొప్ప ముందడుగు అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటని ఆయన గుర్తుచేశారు. జనసంఘ్‌ రోజుల నుంచే ఈ ప్రతిపాదన ఉందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతి, సుఖ సంతోషాల దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా వేసిన ముందడుగుగా ఈ నిర్ణయాన్ని అభివర్ణించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి స్పందిస్తూ.. కశ్మీరీ పండితులకు పునరావాసం కల్పిస్తేనే ఈ బిల్లుకు అర్థం అన్నారు. వాజ్‌పేయి ఆశించిన కశ్మీర్ కల అప్పుడే సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండటం ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకిగా మారిందని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సమాన అవకాశాలు రావాలంటే ఆర్టికల్ 370 రద్దు తప్పనిసరని అన్నారు. జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పరిధి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)కూ వర్తిస్తుందని చెప్పారు.

ఆర్టికల్ 370 రద్దుపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఆర్టికల్‌ను రద్దు చేయడం సాహసోపేతమైన నిర్ణయమని, ప్రధాని మోదీని అభినందిస్తున్నానని అన్నారు. ఈ నిర్ణయంతో భారత్, పాక్ దేశాల మధ్య, కశ్మీర్‌లో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నానని, దేశ సమగ్రత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. స్వతంత్ర భారతం అనే మాట ఇప్పుడు పరిపూర్ణమైందని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంతో దివంగత నేతలు వాజ్‌పేయి, బాల్‌ఠాక్రే స్వప్నం నెరవేరినట్టయిందన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చరిత్రాత్మక నిర్ణయం అని, అందుకే 2019 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతిచ్చామని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే చెప్పారు. 370 రద్దుతో జమ్మూ కశ్మీర్‌ ఇప్పుడు దేశంలో భాగమైందదన్నరు. ఇకపై జమ్మూ కశ్మీర్‌ శాంతి, పురోగతి, శ్రేయస్సు వికసిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.

జమ్మూ కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఢిల్లీ సీఎం, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి జరుగుతాయని ఆశిస్తునట్లు చెప్పారు.

దేశమంతా ఐకమత్యంగా ఉండాలనేది ‘అమ్మ’ జయలలిత ఉద్దేశం అని, ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు అన్నాడీఎంకే పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ నవనీత కృష్ణన్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ కూడా భారత్‌లో భాగమైపోయిందని, ఈ పరిణామానికి బిజూ జనతాదళ్ పార్టీ మద్దతిస్తోందని, తమది ప్రాంతీయ పార్టీయే అయినా.. దేశమే తమకు ముఖ్యం అని ఆ పార్టీ ఎంపీ ప్రసన్న ఆచార్య స్పష్టం చేశారు. భారత పార్లమెంటులో కేంద్రమంత్రి అమిత్‌ షా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారని, చారిత్రక బిల్లులను ప్రవేశపెట్టిన ఆయనకు హ్యాట్సాఫ్‌ అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే ఇన్నేళ్లుగా ఈ బిల్లు నానుతూ వచ్చిందన్నారు. అమిత్‌ షా అభినవ వల్లభాయ్‌ పటేల్‌ అని అభివర్ణించారు. కొన్నేళ్లుగా దేశాన్ని పీడిస్తున్న సమస్యను ఆయన ఒక కొలిక్కి తెచ్చారన్నారు. జాతీయ పతాకాన్ని దగ్ఢం చేస్తుంటే చర్యలు తీసుకోకపోవడాన్ని కశ్మీర్‌లోనే చూస్తున్నామని, దేశానికి రెండు రాజ్యాంగాలు ఎక్కడుంటాయి? అని విజయసాయి రెడ్డి అన్నారు. జమ్మూ కశ్మీర్‌ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కేంద్రం నిర్ణయానికి టీడీపీ మద్దతిస్తోందని, జమ్మూ కశ్మీర్‌ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తున్నానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.కాగా.. ఆర్టికల్ 370, 35-A తొలగింపు పద్ధతి ప్రకారం జరగలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు చిదంబరం విమర్శించారు. బీజేపీ విద్వేషపూరిత ఆలోచనల నుంచే ఈ బిల్లు పుట్టిందని, ఈ నిర్ణయం తప్పని చరిత్రే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు. 370 అధికరణాన్ని అదే అధికరణలోని నిబంధన కింద రద్దు చేయలేమని అన్నారు. 370 రద్దు ద్వారా నియంత్రించలేని శక్తులను నిద్ర లేపుతున్నారని విమర్శించారు. ఈ విధానాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా అనుసరించరని నమ్మకమేంటి? అని ప్రశ్నించారు. ఇలాగైతే రాష్ట్రాలను ముక్కలు చేయకుండా కేంద్రాన్ని ఎవరు ఆపగలరు? అన్నారు. ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలకూ తప్పుడు సంకేతాలు పంపుతుందని చిదంబరం అభిప్రాయపడ్డారు. జమ్మూ కశ్మీర్ ఒక రాష్ట్రంగా దేశంలో కలిసిందని, దాన్ని అలాగే ఉంచాలని కోరారు.

ఆర్టికల్ 370 రద్దు విషయంలో కశ్మీర్‌కు ఇచ్చిన మాట తప్పారని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీ నేత మహ్మద్‌ ఫయాజ్‌ విమర్శించారు. ఇది చారిత్రక నిర్ణయం కాదని.. చారిత్రిక తప్పిదమని అభివర్ణించారు. మరోవైపు ఈ బిల్లును కాంగ్రెస్‌ పార్టీ కూడా వ్యతిరేకించింది. భారత రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఖూనీ చేసిందని, ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నిబంధనలకు బీజేపీ తూట్లు పొడిచిందని ఆ పార్టీ నేత గులాంనబీ ఆజాద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన ఎండీఎంకే నేత వైగో కూడా ఈ బిల్లును తప్పపట్టారు.

జమ్మూ కశ్మీర్ చరిత్రలో దశాబ్దాల నాటి ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సంచలనం నిర్ణయంపైన, నరేంద్ర మోదీ సర్కార్‌పై దాయాది దేశం పాకిస్తాన్ మండిపడుతోంది. భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కశ్మీర్ వివాదం రగులుతూనే ఉంటుందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అక్రమం అని ఘోషిస్తున్న పాక్ విదేశాంగ శాఖ, ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై సవాల్ చేస్తామని తెలిపింది. భారత్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ విషయంలో అక్కడి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం. భారత అధీనంలో ఉన్న ఆ ప్రాంతం వివాదాస్పద ప్రాంతమని అంతర్జాతీయంగా అందరికీ తెలిసిందే. ఈ వివాద స్థితిని భారత ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలూ మార్చలేవు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాల దృష్ట్యా ఇది జమ్మూ కశ్మీర్ ప్రజలకు, పాకిస్తాన్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. భారత్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజల రాజకీయ, దౌత్య హక్కులను కాపాడేందుకు పాక్ కట్టుబడి ఉంది’ అంటూ పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది.

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై అంతర్జాతీయ మీడియా స్పందనలు ఇలా ఉన్నాయి..:

కశ్మీర్‌ను రెండు ముక్కలు చేయడం నాటకీయ చర్య. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలను ఈ చర్య మరింత పెంచవచ్చు. జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదు. ఏదేమైనా గత ప్రభుత్వాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ది గార్డియన్ పత్రిక వ్యాఖ్యానించింది. కశ్మీర్ లోయలో ఇప్పటికే అలజడి నెలకొని ఉండగా, ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న దశలో ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దుతో అశాంతి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని బీబీసీ అభిప్రాయపడింది. కశ్మీరీలకు ఇది నిజంగా సైకలాజికల్ షాక్. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చాలా తీవ్రమైనదంటూ సీఎన్ఎన్ పేర్కొంది. భారత ప్రభుత్వ నిర్ణయం సరికొత్త ఘర్షణలకు, వివాదాలకు తెరలేపిందని, భారత్‌లో కశ్మీర్ చేరికకు మూలం ఆర్టికల్ 370 అని, ఇప్పుడా ఆర్టికల్‌ను రద్దు చేయడం కశ్మీర్‌తో భారత్ సంబంధాలను మరింత దెబ్బతీస్తుందని వాషింగ్టన్ పోస్ట్ పెట్టింది. కశ్మీర్ అంశంలో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తప్పు అని, దీనిపై భారత రాష్ట్రపతి ఎంతో హడావుడిగా గెజిట్ విడుదల చేశారని, ఇక మీదట కశ్మీర్ ముస్లిం ప్రాబల్య ప్రాంతం నుంచి హిందూ ఆధిక్య ప్రాంతంగా మారిపోతుందని కశ్మీర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారంటూ డాన్ తెలిపింది.

ఇలా ఉండగా.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఎన్డీయే ప్రభుత్వంపై బాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ ప్రముఖులు ఇంచుమించు అందరూ ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. వివేక్ ఓబెరాయ్, మాధుర్ భండార్కర్, కంగనా రనౌత్, పరేశ్ రావల్, దియా మీర్జా తదితరులు మోదీ, అమిత్ షా తీసుకున్న నిర్ణయం సబబే అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇది సాహసోపేత నిర్ణయం అని, మోదీ అందుకు తగిన వ్యక్తి అని కొనియాడారు. దేశాన్ని ఉగ్రవాద రహితంగా చేయడంలో ఇది కీలక ముందడుగు అని పేర్కొన్నారు. నేడు భారతమాతకు పరిపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని పరేశ్ రావల్ వ్యాఖ్యానించారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఇదే సరైన నివాళి అని వివేక్ ఓబెరాయ్ అభిప్రాయపడ్డారు.