‘గాలికొదిలేశారు’

15 October, 2019 - 5:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: వైయస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసాపై అట్టహసం చేస్తోందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. మంగళవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక రైతులకు రూ. 50 వేలు ఇస్తామని.. అలాగే 5 ఎకరాల్లోపు రైతులకు ఏటా రూ. 12, 500 మే నెలలో ఇస్తామని పార్టీ ప్లీనరీ వేదికగా వైయస్ జగన్ నాడు ప్రకటించారని ఈ సందర్భంగా నరేంద్ర గుర్తు చేశారు. మరీ ప్లీనరీలో వైయస్ జగన్ చెప్పిన హామీ ఏమైందని? దూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

రైతు భరోసా పేరిట వైయస్ జగన్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన కలిపి ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే వైయస్ జగన్ రైతు భరోసా అంటూ ప్రజలకు హామీ ఇచ్చిన సమయానికి  ప్రధాని కిసాన్ యోజన ప్రకటించలేదని ధూళిపాళ్ల వెల్లడించారు. కేంద్రం రైతులకు ఇచ్చిన మోత్తన్ని రాష్ట్రం తన ఖాతాలో వేసుకుందని ఆయన ఆరోపించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు గాలికొదిలేశారంటూ వైయస్ జగన్‌పై ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విడతల వారిగా సాయం అందించడం వల్ల ఏడాదికి రూ. 10 కోట్ల మేర నష్టం వస్తుంద్నారు.