అందుకే కెప్టెన్సీ వదిలిపెట్టేశా..

14 September, 2018 - 3:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కూల్‌ కెప్టెన్సీతో, బెస్ట్‌ ఫినిషింగ్‌‌తో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అంధించాడు మహేంద్ర సింగ్ ధోనీ. క్రికెట్‌ చరిత్రలో ఈ మాజీ సారథి ధోనీకి సముచిత స్థానం ఎప్పుడూ ఉంటుంది. జట్టు సారథిగా, ఆటగాడిగా ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు ధోనీ.

అలాంటి ధోనీ తాను టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకున్నాడో వెల్లడించాడు. 2019 ప్రపంచకప్‌ సమయంలో తన స్థానంలో కొత్త సారథి రావాలన్న ఆకాంక్షతోనే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు వెల్లడించాడు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో జరిగిన సీఐఎస్‌ఎఫ్‌ కార్యక్రమానికి ధోనీ హాజరయ్యాడు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ధోనీ మాట్లాడుతూ.. సరైన సమయంలోనే తాను కెప్టెన్సీ తప్పుకున్నానని అభిప్రాయపడ్డాడు. ‘2019 ప్రపంచ కప్‌‌కు బలమైన జట్టును తయారు చేసుకోవడానికి కొత్త కెప్టెన్‌‌కు సమయం కావాలి. సారథిగా ముందు అతను కుదురుకోవాలి. ఆ తర్వాత తన వ్యూహాలకు అనుగుణంగా జట్టు సభ్యుల్ని ఎంపిక చేసుకుంటాడు. అందుకే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాను. కొత్త కెప్టెన్‌‌కు సమయం ఇవ్వకుండా జట్టును ఎంపిక చేసుకోమనడం సరి కాదు. అందుకే సరైన సమయంలోనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్నా’ అని వెల్లడించాడు.

ఓడీఐ కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై చెప్పి సరిగ్గా ఏడాదిన్నర అవుతోంది. 2014 మెల్‌‌బోర్న్‌ టెస్టు అనంతరం లాంగ్‌ ఫార్మాట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ఈ రాంచీ డైనమెట్‌ హఠాత్తుగా 2017లో వన్డే, టీ20 క్రికెట్‌ ఫార్మట్‌‌ల కెప్టెన్ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అప్పట్లో ధోనీ నిర్ణయం సంచలనగా మారింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోవడం ఎందరో అభిమానులను నిరాశపరిచింది. అఫ్‌కోర్స్.. తర్వాత ఆ స్థానాన్ని పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ భర్తీ చేశాడు. అయితే.. ప్రస్తుత టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి బాధ్యత అప్పటికప్పుడు అప్పజెప్పింది కాదని మిస్టర్‌ కూల్‌ వివరించాడు.

ప్రస్తుతం ధోనీ క్రికెట్‌ నుంచి కాస్త విరామం దక్కడంతో తన సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతున్నాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్‌‌లో ధోనీ ఆడనున్నాడు. ఇందుకోసం జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మరికొందరు ఆటగాళ్లతో కలిసి ధోనీ గురువారం దుబాయ్‌ బయలుదేరివెళ్ళాడు.

గతంలో కూడా ధోని ముందు చూపు నిర్ణయాలు భారత క్రికెట్‌‌కు ఎంతో మేలు చేశాయని, నిజమైన నాయకుడి లక్షణాలు ధోనీలో ఉన్నాయని నెటిజన్లు ఈ మాజీ సారథిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.