ఆసీస్‌పై ధావన్- రోహిత్ కొత్త రికార్డు

10 March, 2019 - 4:29 PM

(న్యూవేవ్స్ డెస్క్)

మొహాలీ: నాలుగో వన్డేలో టీమిండియా 193 పరుగుల వద్ద తొలి వికెట్‌‌ కోల్పోయింది. ఆస్ట్రేలియాతో మొహాలీలో జరుగుతున్న ఈ వన్డేలో రోహిత్‌ శర్మ (95- 92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక‍్సర్లు) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. ఆసీస్‌ బౌలర్‌ జై రిచర్డ్‌‌సన్‌ బౌలింగ్‌‌లో భారీ షాట్‌‌కు యత్నించిన రోహిత్‌ పెవిలియన్‌‌కు వెళ్ళాడు. అయితే.. ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం సాధించిన భారత్‌ ఓపెనింగ్‌ జోడీగా సరికొత్త రికార్డును ఈ జోడీ నెలకొల్పింది. రోహిత్‌-ధావన్‌‌లు గతంలో ఇదే జట్టుపై నెలకొల్సిన ఓపెనింగ్‌ రికార్డును తామే బద్దలు కొట్టారు. 2013లో నాగ్‌‌పూర్‌‌లో జరిగిన వన్డేలో ఈ జోడి 178 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు మొహాలీ వన్డేలో బద్దలు కొట్టి సరికొత్త రికార్డు రోహిత్‌-ధావన్‌ జంట నమోదు చేయడం విశేషం.కాగా.. భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్‌ ధావన్‌ సెంచరీ పూర్తిచేశాడు. 97 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో సెంచరీ చేశాడు. ఇది ధావన్‌కు 16వ వన్డే సెంచరీ కాగా ఆస్ట్రేలియాపై మూడో సెంచరీ. టాస్‌ గెలిచి, బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌‌కు రోహిత్‌-ధావన్‌ శుభారంభం అందించారు. ఒకవైపు ధావన్‌ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తే, రోహిత్‌ మాత్రం కుదురుగా ఆడాడు.

ఈ క్రమంలోనే ధావన్ హాఫ్‌ సెంచరీ మార్కు చేరాడు. ఈ సీరీస్‌‌లో ఇప్పటి వరకూ పెద్దగా ఆకట్టుకోని ధావన్‌ ఈ రోజు వన్డేలో మాత్రం తనదైన షాట్లతో ఆసీస్ బౌలర్లపై వీరవిహారం చేశాడు. మరో ఎండ్‌‌లో రోహిత్‌ నుంచి పూర్తి సహకారం లభించడంతో ధావన్‌ రెచ్చిపోయి ఆడాడు.