చంద్రబాబు నాయుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్!

14 September, 2018 - 11:16 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ధర్మాబాద్ (మహారాష్ట్ర): ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహా 16 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2010లో అనుమతి లేకుండా బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమించి, సందర్శించిన కేసులో చంద్రబాబు సహా శుక్రవారం అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. మహారాష్ట్రలోని ధర్మాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. వీరిలో తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు కూడా ఉన్నారు. చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసును 21వ తేదీకి వాయిదా వేసింది.

శుక్రవారం ఉదయం నుంచే ఇలాంటి ఊహాగానాలు విన్పిస్తున్నప్పటికీ తాజాగా చంద్రబాబుకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్‌బీడబ్ల్యూ జారీ అయినవారిలో చంద్రబాబుతో పాటు దేవేందర్‌గౌడ్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆనందబాబు, చింతమనేని ప్రభాకర్, సాయన్న, హన్మంత్‌షిండే, గంగుల కమలాకర్, టీ ప్రకాశ్‌గౌడ్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎల్ఎన్ రాజు, విజయ రమణారావు తదితరులు ఉన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ 2010లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ఉమ్మడి ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. బాబ్లీ వద్దకు చంద్రబాబు సహా ఎవ్వరినీ వెళ్లనీయకుండా లాఠీచార్జ్ చేసి, టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు, బాబును బలవంతంగా విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144 సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోకుండా నిబంధనలను అతిక్రమించారని ఆరోపిస్తూ.. కేసులు నమోదు చేశారు.అప్పటి నుంచీ ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే.. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వి తీయడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు నోటీసులు వస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై చంద్రబాబు, టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే.. నోటీసులు వస్తే చంద్రబాబు కోర్టుకు హాజరవుతారంటే ఆయన తనయుడు, ఏపీ మంతరి నారా లోకేష్ స్పష్టం చేయడం గమనార్హం. గురువారంనాడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సేవలో ఉన్న సమయంలో తనకు నోటీసులు వచ్చినట్లు తెలుసుకున్న చంద్రబాబు, తనపై మోపిన అభియోగాల గురించి అందుబాటులో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన ఘటనపై ఇంతకాలం ఒక్కసారి కూడా విచారణకు పిలవకుండా, ఎటువంటి నోటీసులూ జారీ చేయకుండా, ఇప్పుడు ఒక్కసారిగా నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడాన్ని టీడీనీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.