దేవికా రాణి ఆస్తులు ఇవే

05 December, 2019 - 4:49 PM

(న్యూవేవ్స్ డెస్క్)
హైదరాబాద్: ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు దేవికారాణి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. వీటి విలువ దాదాపు రూ. 200 కోట్లు వరకు ఉంటుందని ఏసీబీ పేర్కొంది. దేవికారాణి ఆస్తుల చిట్టాను గురువారం ఏసీబీ బయటపెట్టింది. దేవికారాణికి 50 చోట్ల ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. షేక్ పేట్‌లో రూ. 4 కోట్ల విలువైన విల్లా, అలాగే సోమాజిగూడలో 3 ఫ్లాట్లుతోపాటు షేక్‌పేటలోని ఆదిత్య టవర్స్ లో మూడు ప్లాట్లు, చిత్తూరులో రూ. కోటి విలువైన భవనం, హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలో ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో 11 చోట్ల దేవికారాణికి ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నట్లు తమ దర్యాప్తులో గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణలో ఏడు ప్రాంతాల్లో 32 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు కూడా గుర్తించామని ఏసీబీ అధికారులు వివరించారు.

వరంగల్ కేంద్రంగా ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌ జరిగినట్లు.. ప్రభుత్వం గుర్తించింది. దీనిపై విచారణ జరపగా.. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్) డైరెక్టర్ దేవికా రాణితోపాటు మరో ఆరుగురి ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. సెప్టెంబర్ చివరి వారంలో వారిని అరెస్ట్ చేసి.. ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఆ క్రమంలో దేవికారాణికి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించి.. ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేసింది. అందులోభాగంగా దేవికారాణి ఆస్తుల విలువ దాదాపు 200 కోట్లు పైనే ఉంటుందని ఏసీబీ వెల్లడించింది.