ఏమైనా జరగవచ్చు

08 November, 2019 - 6:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబయి: తన రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆమోదించారని దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. శుక్రవారం  రాజ్‌భవన్‌లో భగత్ సింగ్ కోశ్యారీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. తన మంత్రి వర్గ సహచరులతో కలసి వెళ్లి …. తన రాజీనామా లేఖను అందేశారు. ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించి.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ దేవేంద్ర ఫడ్నవీస్‌కి గవర్నర్ సూచించారు.

అనంతరం రాజ్‌భవన్ బయట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విలేకర్లతో మాట్లాడుతూ… ఈ ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. సీఎంగా రాష్ట్రంలో రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తనకు ఎంతో సంతోషాన్ని కలగించిందని ఆయన చెప్పారు. గత ఐదేళ్లుగా తమ లక్ష్య సాధన కోసం కృషి చేస్తునే ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తనకు సహాకరించిన శివ సేన ఇతర పార్టీలకు దేవేంద్ర ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో తమ కుటమి మరోసారి విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీ అని దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాము చేసిన పనులు ప్రజలకు సంతృప్తి కలిగించాయని.. అందుకే మళ్లీ తమను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించారని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. శుక్రవారం అర్థరాత్రితో మహారాష్ట్ర అసెంబ్లీ కాలం పరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో శనివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా గవర్నర్ పాలన విధించడం కానీ ఏదైనా జరగవచ్చు. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు.

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 21న ఎన్నికలు జరగగా.. అక్టోబర్ 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మిగిలిన స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు వచ్చి ఉండాలి. బీజేపీ, శివసేనలు 161 స్థానాలు వస్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు.

అయితే రెండున్నరేళ్లు మీరు.. మరో రెండున్నరేళ్లు మేము అధికారాన్ని పంచుకుందామంటూ శివసేన పార్టీ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. బీజేపీలోని అత్యధిక నేతలు అందుకు ససేమీరా అన్నారు. అదీకాక మళ్లీ ముఖ్యమంత్రి నేనే అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన చేశారు. ఆ క్రమంలో ఢిల్లీ వెళ్లి.. అమిత్ షాతోపాటు పార్టీలోని పలువురు సీనియర్లతో దేవేంద్ర ఫడ్నవీస్ మంతనాలు జరిపి వచ్చారు. కానీ కమలనాథులు ముఖ్యమంత్రి పీఠంపై ఒక స్పష్టతకు రాలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.