పండుగ వేళ ‘ప్రత్యేక’ దోపిడి..!

12 January, 2018 - 9:15 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: సంక్రాంతి పండుగకు ఊరెళ్లేందుకు పెట్టేబేడా సర్దుకుంటున్నారా? ఎందుకైనా మంచిది ఒక్కసారి ఆలోచించుకోండి. రైల్వే స్టేషన్‌కు వెళ్లాక మనసు మార్చుకోవడం కంటే ఇంటి దగ్గరే ఆ పనిచేస్తే బెటరేమో! ఎందుకంటారా.. పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.

మరోవైపు సంక్రాంతికి స్పెషల్‌ దోపిడి కొనసాగుతోంది. పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రయాణీకుల నుంచి ప్రైవేట్‌ ట్రావెల్ష్‌ మొదలుకొని ఆర్టీసీ, రైల్వేదాకా అందరూ అదనపు వసూళ్ళకు తెరలేపుతారు. ఒక్క సంక్రాంతి అనేకాదు… పండగ ఏదైనా ఇదే తంతు. ప్రతియేటా ప్రయాణీకులపై ఈ ప్రత్యేక బాదుడు మాత్రం తప్పదు. ఈ సారికూడా సంక్రాంతి పండుగకు స్పెషల్‌ పేరిట ప్రయాణికుల జేబులకు చిల్లు వేస్తున్నారు. అటు ఆర్టీసీ, ఇటు రైల్వే బహిరంగ దోపిడీకి పాల్పడుతుంటే… మేమేం తక్కువా అన్నట్లు ప్రైవేటు ట్రావెల్స్ కూడా సంక్రాంతిని క్యాష్‌ చేసుకునే పనిలో ఉన్నాయి.

పండుగకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే స్టేషన్లలో అధిక రద్ది నెలకొంది. రైలు ఎక్కడం కాదు.. ముందు ప్లాట్‌ఫాం పైన నిలబడేందుకు చోటు దక్కడమే మహాభాగ్యం అయింది. రైలు ఎక్కే ప్రయత్నంలో ప్రయాణికులు కిందపడి గాయాలపాలవుతున్న సందర్భాలు ఎక్కువయ్యాయి. పండుగ రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినా అందుబాటులో లేని సమయాలు.. సమాచార లోపం కారణంగా రెగ్యులర్ రైళ్లకు జనాలు పోటెత్తుతున్నారు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించే రైళ్లు పూర్తి రద్దీగా మారాయి.

దూరప్రాంత రెగ్యులర్‌ రైళ్లలో రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో పాటు అదనపు ఛార్జీలతో నడిపే ప్రత్యేకరైళ్లలో సీట్లు నిండిపోయాయి. వీటిలో చాలారైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ పరిమితి కూడా దాటిపోయింది. బెర్తు, సీటు దొరక్కపోయినా..నిల్చొనైనా వెళ్దామనుకున్నా టికెట్లు బుక్‌ చేసుకునే పరిస్థితి లేదు. దీంతో సంక్రాంతికి సొంతూరుకు వెళ్లడమెలా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సికింద్రాబాద్‌తోపాటు కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. శుక్ర, శనివారం ప్రయాణికుల రద్దీ మరింత పెరగనుంది.

సంక్రాంతికి హైదరాబాద్‌ నుంచి పెద్దసంఖ్యలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊళ్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారు ఎక్కువ. రెగ్యులర్‌ రైళ్లకు అదనంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వేశాఖ చెబుతున్నా..రద్దీకి ఇవి ఏమాత్రం చాలడం లేదు. సికింద్రాబాద్‌ వైపు నుంచి విశాఖపట్నం, కాకినాడ, గూడూరువైపు బుధ, గురువారాల్లో వెళ్లిన..శుక్ర, శనివారాల్లో వెళ్లే ప్రత్యేకరైళ్ల సంఖ్య చూస్తే సగటున నాలుగైదే ఉన్నాయి. మిగిలిన రైళ్లు చాలావరకు పండగ ముగిశాక, తిరుగు ప్రయాణమూ ముగిసిన తర్వాత ఉన్నాయి. మరోవైపు రిజర్వేషన్‌ బోగీల్లో నిరీక్షణ జాబితా టికెట్లు దొరికే పరిస్థితి లేకపోవడంతో మిగిలింది జనరల్‌ బోగీలే. సాధారణ రోజుల్లోనే సీటు దొరకని ఈ బోగీల్లో ఇప్పుడు మరింత ఇబ్బందిగా మారింది.

రైళ్లలో ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవడం దుర్లభంగా మారడంతో కనీసం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయించాలనుకున్న వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. పండుగ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. టికెట్ ధరను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నాయి. టికెట్ ధరను మూడింతలు పెంచేసి అమ్ముతున్నారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఊరెళ్లేందుకు మరో మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో వారు అడిగినంత డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ ఏమో కానీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పండుగ చేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా తత్కాల్ విధానాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు. డిమాండ్ ఉన్న రూట్లలో టికెట్ ధరను మూడు రెట్లు పెంచడంతోపాటు 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్టు ప్రయాణికులు తెలిపారు. రవాణాశాఖ వీరికి పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఆర్టీసీ బస్సుల్లోనూ రెగ్యులర్‌తో పాటు 50శాతం అదనపుఛార్జీలతో నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ 12, 13తేదీల్లో వెయిటింగ్‌లిస్ట్‌(ఒక్కో బస్సులో గరిష్ఠంగా ఐదు టికెట్లు) పరిమితి దాటింది అటు ఆర్టీసీలో, ఇటు రైళ్లలో టికెట్లు దొరక్క ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వారు ఛార్జీలు పెంచి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నారు. పండగ సమయాల్లో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఛైర్మన్‌, మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ గురువారం సీఎస్‌ ఎస్పీసింగ్‌, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునిల్‌ శర్మలను కోరారు. ఆర్టీసీ కంటే రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

జనవరి 12నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో 8రోజులు పాటు ప్రధాన రూట్లలో ప్రత్యేకంగా 829 బస్సులను నడుపుతున్నారు. హైదరాబాద్‌, విశాఖ, చెన్నై, బెంగుళూరు నగరాల మధ్య ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది.  హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సీట్లన్నీ ముందుగానే నిండిపోయాయి. 14, 15, 16 తేదీల్లో ఆర్టీసికి ఎన్నడూ లేని డిమాండ్‌ ఏర్పడింది. విజయవాడ, హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు ఛార్జీ సాధారణ రోజుల్లో 355 రూపాయలు. సంక్రాంతి పండుగకు మాత్రం 530 రూపాయలు వసూలు చేస్తున్నారు. విజయవాడ-విశాఖపట్నం సాధారణ ఛార్జీ  480 రూపాయలు కాగా… ప్రస్తుతం 620 వసూలు చేస్తున్నారు. విజయవాడ-బెంగుళూరుకు సాధారణ ఛార్జీ 850 రూపాయలు కాగా.. ప్రస్తుతం 1275 తీసుకుంటున్నారు. విజయవాడ-చెన్నై సాధారణ ఛార్జీ 580 కాగా… 870 రూపాయలు వసూలు చేస్తున్నారు. విజయవాడ హైదరాబాద్‌ మధ్య సాధారణంగా ఏసీ సర్వీస్ ధర 600 రూపాయల వరకూ ఉంటుంది. ఇప్పుడు వెయ్యి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇక నాన్‌ ఏసీ ధర 350 ఉండగా…  850 వరకూ వసూలు చేస్తూ ప్రయాణీకుల నడ్డి విరిస్తున్నారు. దీంతో పండుగకు ఊరికి వెళ్లాలా వద్ద అని ప్రజలు ఆలోచనలో పడ్డారు.