భారత అమ్ములపొదిలో తొలి రఫేల్..!

08 October, 2019 - 8:32 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పారిస్‌ (ఫ్రాన్స్): భారతదేశం అమ్ములపొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అత్యంత అధునాతన తొలి రఫేల్‌ యుద్ధ విమానాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఫ్రాన్స్‌లో అధికారికంగా స్వీకరించారు. ఈ ఫ్రెంచ్ తయారీ జెట్ ఫైటర్‌ రఫేల్‌ను పారిస్‌లోని మెరిగ్నాక్ వద్ద ఉన్న డసోల్ట్ ఏవియేషన్ కర్మాగారంలో రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా స్వీకరించి, ఆయుధపూజ చేశారు. రఫేల్ యుద్ధ విమానం టైర్ల కింద నిమ్మకాయలు ఉంచి, దిష్టి తీశారు. శాస్త్రోక్తంగా పూజలు చేసి, ఆ యుద్ధ విహంగంపై కుంకుమ మిశ్రమంతో హిందీలో ‘ఓం’ అని రాశారు. అంతకు ముందు రాజ్‌నాథ్ ఈ విమానాన్ని పరిశీలించారు. ఒప్పందం ప్రకారం భారత్‌కు మొత్తం 36 రఫేల్ విమానాలను ఫ్రాన్స్ అందించాల్సి ఉండగా ఇది తొలి విమానం.

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. దసరా పర్వదినంతో పాటు 87వ ఎయిర్‌ఫోర్స్‌ డే జరుపుకుంటున్న క్రమంలో తొలి రఫేల్‌ విమానాన్ని అందుకోవడం సంతోషదాయకమని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. రఫేల్ అందుకున్న ఈ రోజు భారత వైమానికదళానికి చరిత్రాత్మమైన రోజు అన్నారు. అనుకున్న సమయానికి రఫేల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ డెలివరీ జరగడం స్వాగతించదగిన పరిణామమని, రఫేల్‌ రాకతో తమ వైమానిక దళం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రన్‌తో రాజ్‌నాథ్ సమావేశమయ్యారు. ఇరు దేశాల రక్షణ, వ్యూహాత్మక సంబంధాలపై వారిద్దరూ చర్చించారు. భారత్- ఫ్రాన్స్ బలమైన ద్వైపాక్షిక బంధాన్ని ఈ భేటీ చాటిందని అనంతరం రక్షణ శాఖ పేర్కొంది.భారత్‌, ఫ్రాన్స్‌లను ఉద్దేశిస్తూ రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల నడుమ రానున్న రోజుల్లో పలు రంగాల్లో పరస్పర సహకారం మరింత బలోపేతమవుతుందని రాజ్‌నాథ్ ఆకాంక్షించారు. రఫేల్‌ జెట్‌ సరఫరాకు శ్రీకారం చుట్టడం ద్వారా నేడు ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య పరంపరలో నూతన మైలురాయి వంటిదని వ్యాఖ్యానించారు. రఫేల్‌ సామర్థ్యం మేర రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వాయుసేనలో భారత్‌ బలోపేతమై ఈ ప్రాంతంలో శాంతిభద్రతల బలోపేతానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. రఫేల్‌కు ఉన్న అద్భుత పోరాట సామర్థ్యాల దృష్ట్యా భారత్ అగ్రరాజ్యాలకు దీటుగా వాయుశక్తిని సముపార్జించుకున్నట్టయింది.