భారతీయ ఖైదీలకు కువైట్‌లో ఉరిశిక్షలు రద్దు..!

30 September, 2017 - 7:36 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కువైట్ రాజు జబెర్ అల్ సబా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షల నుంచి క్షమాభిక్ష పెట్టారు. వారి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. రాజు అల్ సబా నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

నిజానికి షరియత్‌ చట్టాలను కఠినంగా అమలు చేసే అరబిక్‌ దేశం కువైట్‌‌లో క్షమాభిక్ష అనేది అత్యంత అరుదైన విషయం. అలాంటిది ఏకంగా 15 మంది భారతీయ ఖైదీలకు మరణశిక్షలను జీవితఖైదుగా మారుస్తూ కువైట్ రాజు అల్‌ సబా ఉత్తర్వులు జారీ చేసినట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ శనివారం వెల్లడించారు.

15 మంది భారతీయ ఖైదీల మరణశిక్షలను జీవితఖైదుగా మార్చడంతో పాటు మరో 119 మంది భారతీయుల శిక్షా కాలాన్ని కూడా తగ్గించారని సుష్మా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అభ్యర్థనను దయతో స్వీకరించిన కువైట్ రాజుకు సుష్మా ధన్యవాదాలు తెలిపారు. కువైట్ రాజు తాజా ఉత్తర్వుల ప్రకారం జైళ్ల నుంచి విడుదల కానున్న భారతీయ ఖైదీల విషయంలో స్థానిక అధికారులకు అక్కడి భారత రాయబార కార్యాలయం పూర్తిగా సహకరిస్తుందని సుష్మా చెప్పారు.

కువైట్‌‌లో స్మగ్లింగ్‌, హత్య నేరాల కింద శిక్షలు పడిన భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. అయితే, శిక్ష తగ్గిన ఖైదీల జాబితాలో తెలుగువారెవరైనా ఉన్నారో, లేదో తెలియాల్సి ఉంది.