మునిగిన లాంచీలోనే మృతదేహాలు?

16 May, 2018 - 11:44 AM

(న్యూవేవ్స్ డెస్క్)

రాజమండ్రి: గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీ ఆచూకీ దొరికింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్‌‌ల సాయంతో లాంచీని వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో లాంచీలో ప్రయాణిస్తున్న పలువురి మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ మిశ్రా ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం- కొండమొదలు మధ్య మంటూరు ఎగువ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న లాంచీ ఈదురు గాలుల తాకిడితో గోదావరి నీటిలో మునిగిపోయింది. ప్రమాద సమయంలో లాంచీలో సుమారు 55 మంది ఉన్నారని సమాచారం. వారిలో 15 మంది వరకు ఈదుకుంటూ తప్పించుకున్నారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

విశాఖపట్నం నుంచి నేవీ ప్రత్యేక సహాయక బృందంతో పాటు లాంచీ మునిగిన ప్రదేశం వద్ద గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. నేవల్‌ డోర్నియర్‌ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌తో పాటు మూడు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లాంచీ ప్రమాదంపై సమీక్షించారు. గాలింపు, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.