దావూద్ భయపడుతున్నాడు: కస్కర్‌

22 September, 2017 - 12:21 PM


(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: 1993 ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి అండర్‌వరల్డ్‌ డాన్‌, దావూద్‌ ఇబ్రహిం గురించిన కీలక సమాచారాన్ని అతడి సోదరుడు ఇక్బాల్‌ కస్కర్‌ ద్వారా అధికారులు తెలుసుకున్నారు. దావూద్‌ ఇంకా పాకిస్థాన్‌లోనే ఉన్నాడని కస్కర్‌ తెలిపాడు. దోపిడీ, బెదిరింపుల కేసులో ఇక్బాల్‌ కస్కర్‌ను గత మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా కస్కర్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో, థానే క్రైం బ్రాంచీ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు. ఈ సందర్భంగా దావూద్‌ గురించి కీలక సమాచారాన్ని కస్కర్‌ వెల్లడించినట్లు థానే పోలీసులు తెలిపారు. దావూద్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని కస్కర్‌ చెప్పాడు. అయితే దావూద్‌ భారత్‌లోని తన బంధువులు, వ్యక్తులతో ఫోన్లో మాట్లాడేందుకు భయపడుతున్నాడని తెలిపాడు. ఫోన్‌ చేస్తే దాన్ని ట్యాప్‌ చేసి తనను పట్టుకుంటారేమోనని ఆయన ఆందోళనలో ఉన్నట్లు కస్కర్‌ అధికారులకు వివరించాడు. దావూద్‌తో కలిసి ఉంటున్న మరో సోదరుడు అనీస్‌ ఇబ్రహింతో ఇటీవల తాను కొన్నిసార్లు మాట్లాడినట్లు కస్కర్‌ తెలిపాడు.

కాగా, 1993 ముంబై పేలుళ్ల కేసులో దావూద్ కీలక నిందితుడిగా ఉన్నాడు. 24 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ మరణ కాండలో 257 మంది మృతి చెందగా, 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుళ్లు అనంతరం దావూద్‌ భారత్‌ నుంచి పాకిస్థాన్ పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు పాక్‌లోని కరాచీలో దాక్కొని ఉన్నట్లు భారత్ ఆరోపిస్తోంది. అయితే, దావూద్‌ పేరు చెప్పి అతని సోదరుడు కస్కర్‌ ముంబైలో దోపిడీలు, బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని బెదిరించిన కేసులో కస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ముంబై పెలుళ్ల కేసులో టాడా కోర్టు ఇటీవలే తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురిని దోషులుగా తేల్చింది. ముస్తఫా దోసాను న్యాయస్థానం ప్రధాన కుట్రదారుడిగా నిర్దారించింది. కుట్ర చేసి పేలుళ్లకు పాల్పడ్డారని న్యాయస్థానం పేర్కొంది. దావూద్ ఇబ్రహీంకు ముస్తఫా ప్రధాన అనుచరుడు. తాహిర్ మ‌ర్చెంట్‌, ఫిరోజ్ ఖాన్‌కు టాడా కోర్టు ఉరిశిక్ష‌ విధించించి. ఇదే కేసులో మ‌రో నిందితుడు రియాజ్ సిద్ధికీకి ప‌దేళ్ల జైలు, అబూ స‌లేమ్‌కు జీవిత ఖైదు శిక్ష‌ను ఖ‌రారు చేసిన సంగతి తెలిసిందే.