‘నన్ను.. నా దేశభక్తిని అవమానించారు’

29 November, 2018 - 4:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ‘ఏమాత్రం విలువ లేకుండా క్రికెట్ జట్టులో నుంచి నన్ను తీసెయ్యడం చాలా బాధనిపిస్తోంది. జట్టు పట్ల చూపించిన నిబద్ధత, 20 ఏళ్ల పాటు దేశం కోసం నేను పడిన కృషి అంతా వృథా అయిపోయింది. నా కఠోర శ్రమ, మైదానంలో చెమటోడ్చి ఆడిన రోజు, నా కష్టం అంతా మట్టిలో కలిసిపోయాయి. నన్ను.. నా దేశ భక్తిని అవమానించారు’ అంటూ భారత మహిళా క్రికెట్ జట్టు నుంచి బహిష్కృత అయిన మిథాలీరాజ్ ఆక్రోశం వెళ్ళగక్కింది. ప్రస్తుతం జరుగుతున్న వివాదాలతో తన జీవితంలో చీకట్లు అలముకున్నాయని వాపోయింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన ఆవేదన ప్రకటించింది.

స్ట్రయిక్ రేట్ మెరుగ్గా లేకపోవడం వల్లే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌ నుంచి మిథాలీరాజ్‌ను తప్పించామని కోచ్ రమేశ్ పవార్ చెప్పడంపై మిథాలీ స్పందించింది. ‘నా శ్రమ అంతా మట్టి కలిసిపోయింది. చివరికి జట్టులో నా పాత్రే అనుమానంగా మారింది. నా ప్రతిభ పట్ల అనుమానాలు మొదలయ్యాయి. ఇన్నేళ్ళూ ఆడి సాధించినదంతా మరుగున పడిపోయింది. ఈ రోజు నా జీవితంలో అత్యంత చీకటి రోజు. దేవుడే నాకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మిథాలీరాజ్ ఆవేదన వ్యక్తం చేసింది.

టీ 20 ప్రపంచకప్ సందర్భంగా ఇటీవల ఇంగ్లండ్‌‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌‌లో మిథాలీరాజ్‌ను తప్పించారు. దీంతో మిథాలీ ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్‌ రమేశ్‌ పవార్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీలపై ఆరోపణలు చేసింది. వారి వల్లే తనకు అన్యాయం జరిగిందని మిథాలీ బీసీసీఐకి మెయిల్‌ పంపింది. ఇతర మహిళా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తుంటే పరిశీలించే కోచ్ రమేశ్ పవార్ తాను రాగానే అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జట్టు కోచ్ రమేశ్ పవార్ తనను అవమానించారని ఆ లేఖ ద్వారా మిథాలీ తన సందేశం బీసీసీఐకి పంపించింది. దీంతో వివాదం ముదిరిపోయింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌‌లను బుధవారం కలిసిన జట్టు కోచ్‌ రమేశ్‌ పవార్‌.. మిథాలీపై పలు ఆరోపణలు చేశారు. మిథాలీ ఓపెనర్‌‌గా ఆడతానని పట్టుబట్టిందని, లేదంటే ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించిందని బోర్డుకు పవార్ అందించిన నివేదికలో తెలిపారు. మిథాలీతో వేగడం చాలా కష్టమైన పని అని విమర్శించారు. మిథాలీతో తనకు తొలి నుంచీ సత్సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. ఈ క‍్రమంలో మిథాలీరాజ్‌ ట్విట్టర్ వేదికగా మరోసారి తన ఆవేదన వ్యక్తం చేసింది.