లక్షద్వీప్‌పై విరుచుకుపడిన ‘ఓఖీ’ తుఫాను

03 December, 2017 - 9:33 AM


(న్యూవేవ్స్ డెస్క్)

తిరువనంతపురం: ఓఖీ తుపాను లక్షద్వీప్‌పై పెను ప్రభావం చూపిస్తోంది. భారీ వర్షాలకు బలమైన గాలులు కూడా తోడవడంతో పెద్దసంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది చెట్లు నేలకొరిగాయి. సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైంది. సముద్ర మట్టం ఒక్కసారిగా పెరిగింది. వచ్చే 24 గంటల్లో తుపాను మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరిస్తున్నారు. తుఫాను ప్రభావం కల్పెనీ, మినికోయి దీవులపై తీవ్రంగా పడింది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ నిరీక్షక్‌, ఐఎన్ఎస్ జమున, ఐఎన్ఎస్ సాగర్‌ధ్వని కేరళ తీరప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. లక్షద్వీప్‌లో సహాయక చర్యల కోసం ఐఎన్ఎస్ శార్దూల్‌, ఐఎన్ఎస్ శారదను తరలించారు. ఇప్పటి వరకు 531 మంది జాలర్లను రక్షించినట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ భక్తులెవరూ శబరిమలై రావద్దని కేరళ అధికారులు ప్రకటించినా శనివారం అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన వెయ్యిమంది జాలర్ల ఆచూకీ గల్లంతైంది. వీరి ఆచూకీ కోసం నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, ఐఎన్ఎస్ వైభవ్‌ నౌకను రంగంలోకి దింపారు. ఇప్పటివరకూ సుమారు 90మంది జాలర్లను రక్షించారు. తుపాను ప్రభావం ఈ జిల్లాపై ఎక్కువగా పడింది. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ లేక నాలుగు రోజులుగా ప్రజలు అంధకారంలో మగ్గుతున్నారు. తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా కొలంబో(శ్రీలంక)లో 13 మంది మృత్యువాత పడ్డారు.

ప్రస్తుతం ఓఖీ ఈశాన్య అరేబియా సముద్రం నుంచి నెమ్మదిగా వాయువ్యంగా పయనిస్తోంది. 24గంటల్లో ఇది మరింత బలహీనపడి ఆ తరువాత దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్‌ సముద్రం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరింత బలపడి రానున్న 3రోజుల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు సమీపంలోకి రానుందని పేర్కొంది. కోస్తాకు సమీపంలోకి వచ్చాక వర్షాలు పెరుగుతాయని తెలిపింది .ఇక నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ పేర్కొంది.