‘ఓఖీ’తో తమిళనాడు, కేరళకు భారీ నష్టం

02 December, 2017 - 9:03 AM


(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై/తిరువనంతపురం: ‘ఓఖీ’ తుఫాను తమిళనాడు, కేరళ రాష్ట్రాలను వణికిస్తోంది. తుఫాను బీభత్సానికి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ ఆస్తి నష్టం, ప్రాణం నష్టం సంభవించాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 20 మంది మృత్యువాత పడ్డారు. లక్షదీవుల్లోనూ ఓఖి వణికిస్తోంది. వర్ష బీభత్సానికి తమిళనాడులోని కన్యాకుమారి దారుణంగా దెబ్బతింది. తిరునల్వేలి, తూత్తుకూడి, పుదుకోట్టై, రామనాథపురం, విరుదునగర్‌ జిల్లాలు కూడా తుఫాను ధాటికి విలవిల్లాడిపోయాయి. ప్రస్తుతం ఓఖీ తుఫాను లక్షద్వీప్‌లోని మినికాయ్‌కు 80 కి.మి. దూరంలో ఉత్తర ఈశాన్య దిశలో కేంద్రీకృతమై ఉంది. దీనికితోడు దక్షిణ అండమాన్‌ సముద్రం సమీపంలో కేంద్రీకృతమైన వాయుగుండం కూడా తుఫానుగా బలపడే సూచనలు ఉండటంతో వాతావరణ శాఖ ఇరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

‘ఓఖీ’ తుఫాను ధాటికి తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గాఢాంధకారం అలుముకుంది. చాలా ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. సుమారు 3,500 విద్యుత్‌ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సేవల పునురుద్దరణకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఓఖీ కారణంగా కన్యాకుమారిలో 10 మంది మృతి చెందారు. కన్యాకుమారిలోని చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కన్యాకుమారీ -నాగర్‌కోవిల్, నాగర్‌కోవిల్‌-తిరునెల్వేలి జాతీయరహదారుల్లో వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు.

నాగర్‌కోవిల్‌ నుంచి కన్యాకుమారి, తిరువనంతరపురం మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో మత్స్యకారులు గల్లంతయ్యారు. తుఫాను ధాటికి తమిళనాడులో మృతి చెందిన కుటుంబాలకు సీఎం పళనిస్వామి రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేరళలో తుఫాను కారణంగా ఏడుగురు మృతి చెందారు. తాజా తుఫానుకు ‘ఓఖీ’ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇది ఓ బెంగాలీ పదం. దీని అర్థం ‘కన్ను’. కేరళలో విజింజామ్‌ ప్రాంతానికి సమీపంలో సముద్రంలో తుపాను కారణంగా చిక్కుకుపోయిన 69 మందిని గుర్తించి భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌, వాయుసేన సిబ్బంది రక్షించారు.

ఓఖీ తుపాన్ బీభత్సంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో 30 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో 24 గంటలు కన్యాకుమారి, త్రివేండ్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తమిళనాడును అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం పళనికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.