‘బుల్‌బుల్’ తుపాను తీవ్రరూపం

08 November, 2019 - 7:22 AM

(న్యూవేవ్స్ డెస్క్)

విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్‌ తుపాను పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌కు 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో ఈ తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం బుల్‌బుల్‌.. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకూ ఉత్తర దిశగా పయనించనుంది. తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

బుల్‌బుల్‌ తుపాను తీవ్రరూపం దాలుస్తున్నందున విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. బుల్‌బుల్ కారణంగా సముద్రం అలజడిగా ఉండనున్నదని, మత్స్యకారులెవరూ శుక్రవారం చేపలవేటకు బంగాళాఖాతంలోకి వెళ్లొద్దని హెచ్చరించి వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు చేశారు.