తెలుగుకు కిరీటం

12 December, 2017 - 3:23 PM

మీడియా పల్స్‌

ఈ ఆదివారం పత్రికలలో తెలుగుభాష ఒక ప్రధాన అంశంగా మారిపోయింది. ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఆదివారం సంచికలను పూర్తిగా తెలుగుభాష, సంస్కృతి వంటి విషయాలపై కేంద్రీకరించి రెగ్యులర్ ఫీచర్స్‌ను వాయిదా వేశారు. సాక్షి, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి ఆదివారం సంచికలు మాత్రం యధావిధిగా ఉండిపోయాయి. ఈనాడు, వార్త ఈ విషయంపై కవర్ స్టోరీలను ప్రచురించాయి. సాక్షి, ఆంధ్రజ్యోతి పెద్దగా పట్టించుకోకపోయినా, ప్రధాన సంచికలో ఈనాడు రెండు పేజీలు కేటాయించి, కొన్ని రోజులు ఇలానే కొనసాగుతుందనే అభిప్రాయం కలిగించింది. ఇంగ్లీషు పత్రికలలో ఈ తెలుగు ఊసు కనబడలేదు, ఒక్క హన్స్‌లో తప్ప. ‘తెలుగు ప్రైడ్’ అని ప్రధాన సంచికలో ఒక పేజీ, ఆదివారం సంచికలో రెండు పేజీలు కేటాయించడం ఆదివారం హన్స్‌ ప్రత్యేకత. ఇంగ్లీషు పత్రికలలో తెలుగు భాష గురించీ, సాహిత్యం గురించీ, సంస్కృతి గురించీ చదవడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో డిసెంబర్ 15వ తేదీ నుంచి మొదలవుతున్న వేళ మీడియా సమాయత్తం కావడంలో విశేషం ఏమీ లేదు. శుక్రవారమే ప్రారంభమవుతున్నాయి కనుక తగిన మూడ్ ఏర్పరచడంలో ఇది కీలకం. భాషా సాహిత్యాలను నిరాదరిస్తుందనే పేరు పడిన ఈనాడు, తొలుత తెలుగు వైభవం పేరుతో ఒకటిన్నర పేజీలు కేటాయించడం ముదావహమే!

పెద్ద పత్రికలు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చేయలేనిది ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ చేయగలిగాయి – ఆదివారం సంచికలను భాషా సంస్కృతులకు కేటాయించి. మామూలుగా ఆదివారం సంచికలో ఉండే విషయాలకు బదులుగా ఈ విషయాలే ఇవ్వడం ఒక రకంగా తెలివైన ప్రయత్నమే! యాజమాన్యాలకు అదనపు ఖర్చు అసలు ఉండదు. ప్రకటనలు సేకరించే సమస్య విలేఖరులకు ఉండదు. కానీ దాచుకునే రీతిలో సంచికలు తయారవుతాయి. ఈ రకంగా భూమి, ప్రభ పత్రికలు హర్షణీయమైన ప్రయత్నమే చేశాయి. అదే పనిని ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికలు చేయలేకపోవడానికి అసలు కారణం వారి ఎజెండాలో ఇది కీలక అంశం కాకపోవడంగానే పరిగణించాలి. భాషను ఏదో సోమవారం సాహిత్య పేజీ వారి వ్యవహారంగా వదిలివేయడం అన్యాయమే. నిజానికి ఈ సోమవారం పేజీలు దాదాపు సాహిత్యపు పేజీలే. భాష అనేది ఎక్కువ ప్రాధాన్యత లేకుండా ఉండిపోవడం కూడా ఇక్కడ గమనించవచ్చు. నిజానికి ఈ దృష్టి ఉండి ఉంటే ఈనాడు ఈ ధోరణిలో నాలుగున్నర దశాబ్దాలు సాగి ఉండదు. పాలకులకు ఈ దృష్టి ఉంటే పత్రికలు తప్పక పాటిస్తాయి – ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి కాబట్టి మీడియాలో భాష కీలక అంశంగా మారినట్లు. లేదా మీడియాకు ఆసక్తి ఉంటే వత్తిడి చేసి దానిని ప్రభుత్వాల ఎజెండాగా మారుస్తాయి. ఈ రెండూ కొరవడినాయి కనుకనే మళయాళం, కన్నడం, తమిళ భాషలతో పోల్చుకుంటే భాషాభిమానం విషయంలో తెలుగు దిగదుడుపుగా ఉంది. బెంగాలీ, తమిళ భాషాభిమానం గురించి కథలుగా చెప్పుకుని వారి వచన సాహిత్యాన్ని అనువదించుకుని సర్దుకోవడం తెలుగు వారి విధానం.

నిజానికి భాష గురించీ, భాషతో ముడివడిన విషయాల గురించీ ఏదో ఒక సందర్భంలో ఎక్కువ చర్చించుకుంటే సరిపోదు. అటువంటి ప్రయత్నం నిరంతరాయంగా, ప్రణాళికాబద్ధంగా సాగాలి. ఇతర భాషల పట్ల ప్రాంతాల పట్ల ద్వేష భావం, తూష్ణీభావం కన్నా మన వాటిపై హేతుబద్ధమైన ప్రేమ ఉండాలి. కర్నాటక రాష్ట్రంలో నవంబరు నెలంతా రాష్ట్రోత్సవాల పేరిట భాష, సంస్కృతి సంబంధమైన విషయాలపై కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతాయి. అక్కడ ఏమి జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో మనం ఎందుకు గమనించకూడదు! ప్రాచీన హోదా రావడంలో ఎందుకు జాప్యం జరిగిందన్న విషయమే కాదు, అది సాధించుకున్న తర్వాత తమిళంలో ఏమి సాగుతుందో కూడా తెలియజేయవచ్చు. ఈ పనులను ప్రధానంగా పత్రికలు చేయాలి. పెద్ద తెలుగు పత్రికలకు బెంగుళూరు, మద్రాసు నగరాలలో ఎడిషన్లు ఉన్నాయి, సిబ్బందీ అందుబాటులో ఉన్నారు.

సమయం వచ్చినపుడు రాజకీయ నాయకులను విమర్శించడం బాగానే ఉంటుంది కానీ మీడియా చెయ్యాల్సిన పని కూడా ఉంది. పత్రికలు ప్రధానంగా భాషను నమ్ముకుని సాగే పరిశ్రమలో భాగం. ఈ కోణంలో చూస్తే భాషా విషయాలు వారి అస్తిత్వంలో భాగమే. గాడిచర్ల హరిసర్వోత్తమ రావు శతాబ్దం కిందట సంపాదకుడిగా ‘ఆంగ్ల పదాలకు ఆంధ్ర పదాలు’ అనే శీర్షిక నడిపిన పత్రికల చరిత్ర మనది. కానీ నేడు భాషకూ సాహిత్యానికీ తేడా తెలియని వారే ఎక్కువ మంది కనబడుతున్నారు. నీటిగొట్టం, నీరు ఒకటి కాదు.

ఆదివారం సంచికలే కాదు, సోమవారం రోజు సాక్షి, ఆంధ్రజ్యోతి దినపత్రికలు భాషా విషయాలకు సాహిత్య పేజీని కేటాయించాయి. ఎవరి పద్ధతిలో వారు సాగుతున్నారు. ఈనాడు రెండు పేజీల కేటాయింపు నడుపుతోంది. హన్స్ ఇండియాలో సోమవారం కూడా ఒక పేజీ తెలుగు మహాసభల విషయాలున్నాయి. ఇవన్నీ కాకుండా తెలుగు నాయకత్వం గురించి ఆలోచింపజేయాలి. కర్నాటక నుంచి కేంద్ర మంత్రి చేసిన వీరప్ప మొయిలీ రాజకీయ నాయకుడే కాదు, అద్భుతమైన కళాకారుడు కూడా. అలాగే తమిళ రాజకీయవేత్త కరుణానిధి గొప్ప కళాకారుడూ, పండితుడూ. ఇలా తెలుగువారిలో ఎవరి గురించైనా చెప్పుకోగలమా! గిరీష్ కర్నాడ్ లాగా తెలుగు విషయాలు వ్యాప్తి చేయగల స్థాయిలో భాషా సామర్ధ్యాలు, ప్రజాదరణ కలవారు మనలో ఉన్నారా? తెలుగుకు జ్ఞానపీఠాలు మూడే అని బాధపడడం కన్నా కన్నడంలో ఎనిమిది రావడానికి జరిగిన కృషి ఏమిటో చెప్పగలగాలి. ఒకవైపు పరిశోధన, ఇంకోవైపు డాక్యుమెంటేషన్, మరోవైపు ప్రచారం, వీటికి మించి ఘనమైన కృషి దీర్ఘకాలికంగా ఉంటే గానీ సంచలనాలు సంభవించవు.

– నాగసూరి వేణుగోపాల్

మీడియా విశ్లేషకులు