సీపీఐ నేత దాస్‌గుప్తా తుదిశ్వాస

31 October, 2019 - 9:48 AM

(న్యూవేవ్స్ డెస్క్)

కోల్‌కత్తా: సీపీఐ పార్టీ సీనియర్‌ నాయకుడు గురుదాస్‌ దాస్‌గుప్తా (83) గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా ఆయన గుండె, మూత్రపిండాల సంబంధమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురుదాస్ దాస్‌గుప్తా మృతిచెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో బెంగాల్‌లోని పంక్‌సురా నియోజకవర్గం నుంచి, 2009లో ఘాటల్ నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన పలుమార్లు ఎన్నికయ్యారు. ముందుగా రాజ్యసభకు 1985, 1988, 1994లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇలా మొత్తం 25 సంవత్సరాల పాటు ఆయన పార్లమెంటేరియన్‌గా ఉన్నారు. 2009 నుంచి సీపీఐ తరఫున లోక్‌సభా పక్ష నేతగా కూడా గురుదాస్ దాస్‌గుప్తా వ్యవహరించారు.

2001లో ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ (ఏఐటీయుసీ) ప్రధాన కార్యదర్శిగా గురుదాస్‌ దాస్‌గుప్తా సేవలు అందించారు. ‘సెక్యూరిటీస్ స్కాండల్ ఏ రిపోర్ట్ టు ది నేషన్’ అనే పుస్తకాన్ని ఆయన రాశారు. గురుదాస్ దాస్‌గుప్తా మృతిపై సీపీఐ జాతీయ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.