జగన్‌పై రామకృష్ణ ఫైర్

16 March, 2020 - 6:16 PM

(న్యూవే్వ్స్ డెస్క్)

అమరావతి: రాజధాని రైతులకు మద్దతుగా.. రాష్ట్రంలో ఆందోళనలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా.. తాము అండగా ఉంటామని రైతులకు రామకృష్ణ భరోసా ఇచ్చారు. రైతులు, మహిళులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని జగన్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా రామకృష్ణ డిమాండ్ చేశారు. మందడం ద్రోను కేసులో మంగళగిరి కోర్టులో హాజరయ్యేందుకు వచ్చిన రైతులను రామకృష్ణ సోమవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ… మూడు రాజధానులపై రిఫెరెండమ్ నిర్వహించే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలోని మొత్తం  13 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ మూడు రాజధానులు ఆమోదించారని సీఎం జగన్ చెబుతున్నారని… మరీ దమ్ముంటే  అమరావతి ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్‌కు రామకృష్ణ సవాల్ విసిరారు.

శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు సెలక్ట్ కమిటీకి పంపారని.. మండలినే రద్దు చేయాలని తీర్మానం చేశావంటూ జగన్‌పై రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేస్తే.. ఆయనపైనే జగన్ ధ్వజమేత్తారని రామకృష్ణ గుర్తు చేశారు. ఆయన్ని కూడా జగన్ రద్దు చేయాలని అనుకుంటారని.. కానీ ఆయన్ని రద్దు చేయడం చేత కాక.. ఆగారంటూ సీఎం జగన్‌పై రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధాని కోసం రైతులు, మహిళలు గత 90 రోజులుగా పోరాడుతున్నారన్నారు. తొమ్మిది మాసాల తర్వాతైనా జగన్ నిజం మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. మాచర్ల ఘటన సిగ్గు చేటు అని… నిందితులకు స్టేషబ్ బెయిల్ ఇస్తారా?  అని రామకృష్ణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.