ప్రో కబడ్డీకి 7వ సీజన్‌కు కౌంట్‌డౌన్

19 July, 2019 - 7:40 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: మన దేశవాళీ క్రీడ కబడ్డీ లీగ్ 7వ సీజన్ పోటీలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయి. మూడు నెలల పాటు కొనసాగే ఈ పోటీలలోని మొదటి అంచె పోటీలకు తెలుగు టైటాన్స్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 20 నుంచి 26 వరకూ మొత్తం 11 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తెలుగు టైటాన్స్, యూ-ముంబై, పుణేరీ పల్టాన్, గుజరాత్, పట్నా పైరేట్స్, బెంగళూరు, జైపూర్ పింక్ పాంథర్స్, హర్యానా, ఢిల్లీ, తమిళ్ తలైవాస్, యూపీ జట్లు ఈ ప్రో కబడ్డీ పోటీల్లో తలపడనున్నాయి.

కాగా.. తెలుగు టైటాన్స్ జట్టుకు ఇరానీ డిఫెండర్ అబోజర్ మిఘానీ నాయకత్వం వహిస్తున్నాడు. గులాం రెజా చీఫ్ కోచ్‌గా 7వ సీజన్ లీగ్‌లో తెలుగు టైటాన్స్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నది. ఈ లీగ్ లో పాల్గొంటున్న జట్లు తమ జట్లలో మార్పులు చేర్పులతో పాటు లోగో ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా ముగించాయి.ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలుగు టైటాన్స్‌ జట్టు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్‌పై గురువారం సందడి చేసింది. తెలుగు టైటాన్స్‌ యాజమాన్యం జట్టు పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో సందీప్‌ కిషన్‌తో పాటు తెలుగు టైటాన్స్‌ జట్టు సభ్యులు పాల్గొన్నారు. బుద్ధుడి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 లోగోను సందీప్‌ కిషన్‌ ఆవిష్కరించారు. ప్రో కబడ్డీ లీగ్‌ లోగోను ఆవిష్కరించడం చాలా సంతోషకరం అని సందీప్ కిషన్ అన్నారు. కబడ్డీ అంటే తనకు ఎంతో ఇష్టమని, టీవీలో చూసేవాడినని చెప్పారు. ప్రో కబడ్డీ 7వ సీజన్‌ లీగ్‌ను ప్రత్యేకంగా ఆస్వాదిస్తానని చెప్పారు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ తొలి అంచె పోటీల వివరాలు-

జూలై 20న జరిగే ప్రారంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో యూ-ముంబా ఢీకొంటుంది. అదేరోజు జరిగే రెండో మ్యాచ్‌లో బెంగళూరు, పట్నా జట్లు తలపడతాయి.

జూలై 21న జరిగే పోటీలలో బెంగళూరుతో గుజరాత్, తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ పోటీపడతాయి.

జూలై 22న యూ-ముంబాతో జైపూర్, పూణేరీ పల్టాన్‌తో హర్యానా ఢీకొంటాయి.

జూలై 24న జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్‌తో యూపీ, తెలుగు టైటాన్స్‌తో ఢిల్లీ తలపడతాయి.

జూలై 25నాటి పోటీలో ఢిల్లీతో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది.

జూలై 26న జరిగే డబుల్ రెండు మ్యాచ్‌లలో యూపీతో గుజరాత్, తెలుగు టైటాన్స్‌తో పట్నా పైరేట్స్ పోరాటం చేస్తాయి.

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల కబడ్డీ అభిమానులకు ప్రత్యక్షంగా 11 మ్యాచ్‌లు చూసే అవకాశం ఉంది.