‘దయచేసి పెళ్లికి రావద్దు’

17 March, 2020 - 8:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

శ్రీరామనవమి అంటేనే చలువ పందిళ్లు… తాటాకు చాపలు.. పానకం.. ఇంకా శ్రీరాములోరు సీతమ్మోరు కళ్యాణం కళ్లకు కట్టినట్లు పాట రూపంలో చెప్పాలంటే మాత్రం.. సీతారాముల కల్యాణం చూతమురారండి.. శ్రీ సీతారాముల కల్యాణం చూతమురారండి.. ఇది కల్యాణపు బొట్టును పెట్టి.. మణిబాసికమును నుదుటన గట్టి.. అంటూ సాగే సాంగ్. శ్రీరామనవమి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ ఊరు..ప్రతి వాడలో ఈ పాట మారుమోగాల్సిందే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 2 శ్రీరామనవమి. ఈ నవమి నాడు ఈ పాట వినపడే ఛాన్స్ లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా అప్రమత్తమైంది.

ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ అరికట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అందులోభాగంగా తెలంగాణలోని భద్రాచలంలో ఈ ఏడాది సాదాసీదాగా రాములోరి కల్యాణం జరగనుంది. కేవలం అర్చకులు మాత్రమే ఈ కల్యాణాన్ని నిర్వహిస్తారని తెలంగాణ సర్కారు తెలిపింది. శ్రీరామనవమి వేడుకల కోసం భద్రాచలం రావద్దని ఇప్పటికే భక్తులకు ప్రభుత్వం సూచించింది. అంతేకాదు భద్రాచలంలో రాములోరి కల్యాణాన్ని వీక్షించేందుకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు నగదు వాపస్ ఇస్తామని కూడా ప్రకటించింది. ఇక రాములోరి కల్యాణానికి సంబంధించిన అన్ని పనులు నిలిపివేయాలని భద్రాచంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కొలువైన శ్రీరాముని కళ్యాణం సాదాసీదాగా జరపాలని టీటీడీ నిర్ణయించింది. 2015కు ముందు ఒంటిమిట్టలోని శ్రీరామునికి కళ్యాణం గుడిలోనే నిర్వహించే వారు.. ఈ ఏడాది అలాగే అదే పద్దతిలో నిర్వహించాలని ఆలయ అధికారులకు టీటీడీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు  జారీ చేసిందని సమాచారం. రాములోరి కల్యాణం కోసం ఒంటిమిట్ట రావద్దని భక్తులకు టీటీడీ సూచించింది.  స్వామి వారి కల్యాణం టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతోందని.. దీంతో భక్తులంతా ఇంటి వద్దే ఉండి.. బుల్లి తెరపై రాములోరి కల్యాణం వీక్షించి.. ఆయన కృపా కటాక్షాలకు పాత్రుల కావాలని కూడా టీటీడీ సూచించింది.

అయితే 2014కు ముందు శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో అంగరంగ వైభవంగా జరిగేవి. ఈ వేడుకులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి స్వయంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించేవారు… ఇది అనాదిగా వస్తున్న అనవాయితీ. కాగా 2014లో రాష్ట్ర విభజనతో భద్రాచలం తెలంగాణకు వెళ్లితే.. ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఆలయాన్ని టీటీడీకి నాటి ప్రభుత్వమే  అప్పగించింది. నాటి నుంచి ఒంటిమిట్టలో రాములోరి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతోంది. శ్రీరాములోరి కల్యాణానికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులే కాక.. పక్క రాష్ట్రాల నుంచి భక్తులు కూడా భారీగా తరలి వచ్చేవారు. కానీ నేడు కరోనా ఎఫెక్ట్ కారణంగా భక్తులు ఎక్కడి వారు అక్కడే గప్ చిప్ సంబారు బుడ్డి అన్న రీతిగా తయారైంది. ఎవరికీ వారు… ఇళ్లలోనే ఉండి భక్తితో రాములోరిని బుల్లితెరపై వీక్షించుకుంటూ జై శ్రీరామ్ అనుకోవడం అత్యుత్తమం.