అభ్యర్థులను ఓకే చేసిన అధిష్ఠానం

13 May, 2019 - 5:15 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ రెడ్డి, వరంగల్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఇనుగుల వెంకట్రామిరెడ్డి, రంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఉదయ మోహన్‌రెడ్డి పేరులను పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది.

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్.. ఆదివారామే ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. వరంగల్ జిల్లాలో పార్టీ సీనియర్ నేత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ పార్టీ సీనియర్ నాయకుడు తేరా చిన్నపరెడ్డిల పేర్లను ఖరారు.

కేసీఆర్ గత వారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటనకు వెళ్లే ముందు .. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పార్టీలోని సీనియర్లతో చర్చించి.. ఈ ముగ్గురు పేర్లను ఖరారు చేశారు. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం కేసీఆర్ తమిళనాడు నుంచి వచ్చిన తర్వాత.. పార్టీలోని సీనియర్లతో మరోమారు సమావేశమై.. ఈ ముగ్గురు పేర్లును అధికారికంగా ప్రకటించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.