ప్రణబ్‌కు కాంగ్రెస్ ఊహించని షాక్

11 June, 2018 - 5:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఒక వైపున ప్రధాని పదవికి తాను అర్హుడినని, వచ్చే సార్వత్రిక ఎన్నికలతో చిరకాల కోరికను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీర్చుకోనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు సొంత పార్టీ కాంగ్రెస్సే ఆయనకు షాకిచ్చినట్లు తెలుస్తోంది.

సుమారు రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ నెల 13న ఢిల్లీలోని తాజ్‌ ప్యాలెస్‌ హోటల్‌‌లో నిర్వహించనున్న ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్‌‌కు ఆహ్వానం అందలేదు.

ఈ విందుకు ఆహ్వానించే జాబితాలో హై-ప్రొఫైల్ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేక కూటమిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రణబ్‌‌‌ను ఆహ్వానించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ఈ కీలక ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్‌ ముఖర్జీతో పాటు ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ రాష్ట్రపతి హమీద్‌ అన్సారీలకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానాలు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్డీఏ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని అందుకు ఈ ఇఫ్తార్‌ ఈవెంట్‌‌ను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది.

ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) మహారాష్ట్రలోని నాగ్‌‌పూర్‌‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రణబ్‌ హాజరుకావడం కాంగ్రెస్‌ కూటమికి అంతగా రుచించడం లేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావద్దంటూ ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు సూచించారు. అయినప్పటికీ ప్రణబ్ హాజరయ్యారు. కాగా, తమకు అనుకూల పార్టీలకు ఇఫ్తార్‌ విందుకు ఆహ్వానాలు పంపిన కాంగ్రెస్‌.. ఆయా పార్టీల అధ్యక్షులు హాజరు కాని పక్షంలో ఇతర కీలక నేతలను పంపాలని కోరింది.