ఆ వ్యూహం వెనుక ప్రియాంకా వాద్రా…!

16 May, 2018 - 1:55 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. గవర్నర్ కోర్టులో ఇప్పుడు బంతి ఉంది. దీంతో గవర్నర్ నిర్ణయం మేరకే తదుపరి ప్రభుత్వాన్ని ఎవరూ చేపట్టనున్నారో తెలియనుంది.
ఇదిలా ఉంటే.. కన్నడనాట ఏ పార్టీకి మెజారిటీ లభించని నేపథ్యంలో జేడీ(ఎస్)కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ అనూహ్యంగా నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. కర్ణాటక రాజకీయాలను కుదిపేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకోవడం వెనుక సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక వాద్రా చతురతతో కూడిన నిర్ణయం ఉందట! హంగ్ ఏర్పడిన సభలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఓ పక్క విశ్లేషణ జరుగుతుంటే ప్రియాంక చేసిన ఈ సంచలన నిర్ణయం రాజకీయ పండితులను కూడా ఆలోచనలో పడేసింది.

కర్ణాటకలో ముందు నుంచీ జేడీఎస్‌‌తో పొత్తుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌‌గాంధీ అయిష్టత ప్రదర్శించారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సంక్షోభం నెలకొనడంతో ప్రియాంక వాద్రా చకచకా పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో కీలకపాత్ర వహించడానికి జేడీఎస్‌‌కు మద్దతు తెలపాలని, కుమారస్వామికి సీఎం పదవిని ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారట.గోవా, మణిపూర్‌‌లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొన్న కాంగ్రెస్ కర్ణాటకలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఒక పక్క ఫలితాలు వెలువడుతుంటడగానే పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్‌ను రంగంలోకి దించింది. కాగా.. ప్రియాంక వాద్రా సలహా రాహుల్‌ కూడా కన్విన్స్ అవడంతో వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం చకచకా పావులు కదిపింది. వెంటనే దేవెగౌడ, కుమారస్వామితో చర్చలు జరపాలని సోనియా ఆదేశించారు. ఈ మేరకు ఆజాద్ బృందం జరిపిన చర్చలు సఫలం కావడంతో బీజేపీని అధికారానికి దూరంగా పెట్టే ప్రయత్నం సక్సెస్ అయింది.

కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల మార్కును చేరుకోలేని పరిస్థితిలో ప్రియాంక వాద్రా సూచనను సీఎం అభ్యర్థి సిద్దరామయ్య గత్యంతరం లేక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒకవేళ 100 సీట్ల మార్కు దాతే కాంగ్రెస్‌ డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండేదనేది రాజకీయ వర్గాల అభిప్రాయం.
మరో పక్కన తన కుమారుడు కుమారస్వామిని సీఎంగా చూడటమే దేవెగౌడ ఏకైక స్వప్నం. సీట్లు గెలువకుండానే అదృష్టం కలిసి వచ్చి సీఎం పదవి కళ్ల ముందు కదలాడటంతో దేవెగౌడ ఏమాత్రం ఆలోచించలేదు. కాంగ్రెస్ పార్టీ బేషరతు మద్దతు ఇస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు దేవెగౌడ సుముఖత ప్రదర్శించారు. ఆ తర్వాత గవర్నర్‌‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు మెజారిటీ ఉందని కుమారస్వామి తన వాదన వినిపించారు.

కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయ చతురత ప్రదర్శించడం వెనుక ప్రియాంక వ్యూహం పెద్ద ప్రభావాన్నే చూపింది. గతంలో మణిపూర్, గోవా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడానికి కాంగ్రెస్ వ్యూహాల్లో అనేక లోపాలు కనిపించాయి. ప్రస్తుతం ప్రియాంక చతురత కాంగ్రెస్‌‌కు కలిసి వచ్చేలా కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.