మళ్ళీ కన్ను గీటిన రాహుల్ గాంధీ!

12 August, 2018 - 5:47 PM

 (న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై లోక్‌‌‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌగిలింతలు, కన్నుగీటడంతో వార్తల్లో నిలిచిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్ళీ కన్నుగీటుతూ కెమెరా కంటికి చిక్కారు. రాజస్థాన్‌‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో పార్టీ రాష్ట్ర చీఫ్‌ సచిన్‌ పైలట్‌‌కు రాహుల్ కన్ను గీటుతున్న దృశ్యం వీడియోలో రికార్డయింది.

రాహుల్‌ కన్ను కొట్టిన మరుక్షణమే సచిన్‌ పైలట్‌ వేదిక మీదున్న మాజీ సీఎం, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌‌ను కౌగిలించుకోవడం గమనార్హం. రాజస్థాన్‌ కాంగ్రెస్‌‌లో ఐక్యతకు సంకేతంగానే వేదికపై ఇలా కౌగిలింతల సీన్‌‌ను రక్తికట్టించారని అంటున్నారు.

రాహుల్‌ ప్రసంగం ముగిసిన తర్వాత కూడా ఇద్దరు నేతలను సన్నిహితంగా తీసుకువచ్చి వారు నేతలు ఐక్యంగా ఉన్నారనే సంకేతాలు పంపేందుకు ప్రయత్నించారు. సభా వేదికపై రాహుల్‌‌కు ఇరువైపులా సచిన్‌ పైలట్‌, గెహ్లాట్‌ ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు.