రెండు రూపాయల కోసం హత్య!

10 November, 2019 - 10:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కాకినాడ: అచ్చంగా అరవింద సమేత.. వీరరాఘవ సినిమాలో మాదిరిగానే తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఓ మర్డర్ జరిగింది. ‘అరవింద సమేత.. వీర రాఘవ’ సినిమాలో ఐదు రూపాయల కోసం హత్యలు జరిగినట్టు చూపిస్తే.. ఆశ్చర్యపోయాం. మరీ 5 రూపాయల కోసం హత్యలా..! అని ముక్కున వేలేసుకున్నాం. అయితే.. అలాంటి ఘటనే కాకినాడ రూరల్‌ వలసపాకలో ఆదివారం జరిగింది. రెండు రూపాయల కోసం జరిగిన గొడవలో సువర్ణరాజ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

సువర్ణరాజు సైకిల్‌ టైర్లలో గాలి నింపుకునేందుకు సాంబ సైకిల్‌షాప్ వద్దకు వెళ్లాడు. గాలి పెట్టినందుకు రూ.2 ఇవ్వాలని సాంబ సువర్ణరాజుని అడిగాడు. అయితే. అతను రూ.2 ఇవ్వకపోగా.. సాంబపైనే దాడికి దిగాడు. దీంతో అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పారావు.. తన స్నేహితుడిని ఎందుకు కొడుతున్నావంటూ సువర్ణరాజుతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అప్పారావు సువర్ణరాజుని కత్తితో పొడిచాడు. సువర్ణరాజును హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.