మీడియా ప్రయాణంలో పదనిసలు

18 December, 2017 - 3:53 PM

మీడియా పల్స్

తప్పెట కొట్టి చాటింపు వేయడం నుంచి ఆండ్రాయిడ్ తట్టి మాట్లాడడం దాకా సాగిన మన కమ్యూనికేషన్స్ ప్రస్థానాన్ని గమనిస్తే బోధపడేది ఏమిటి?

అచ్చుయంత్రం, టెలిగ్రాఫ్, టెలిఫోన్, రేడియో, టెలివిజన్, కంప్యూటర్, మొబైల్ సెల్‌ఫోన్ వంటి సమాచార సాధనాలు రావడంతో భావ ప్రసార విధానం, వినియోగం విపరీతంగా పెరిగాయి. ఈ టెక్నాలజీ ఆధారంగానే కమ్యూనికేషన్‌ రూపం, స్వభావం, విస్తృతి మారుతూ వచ్చాయి.

తొలిదశలో భాష వృద్ధి చెందడంతో భావ వ్యక్తీకరణ విధానాలు మారాయి. దాంతో సమాచార ప్రసార మార్గాలు రూపొందుతూ వచ్చాయి. మలిదశలో దూరాన్ని జయిస్తూ, ఏక కాలంలో ఎక్కువ మందిని చేరగలిగే టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. అందులో కూడా మార్పులు ఎంత తీవ్రంగా, శీఘ్రంగా ఉన్నాయో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. టెలివిజన్ చానళ్ల వేగం ఏమిటో, దీనితో పోలిస్తే మొబైల్‌ దూకుడు ఏమిటో ఒకసారి పోల్చుకోండి!ఈ మీడియా ప్రయాణంలో పదనిసలు చాలా ఉన్నాయి. ఇది వంద సంవత్సరాల క్రితపు తూర్పు దేశాల ముచ్చట. పత్రికల రాజ్యంలోకి రేడియో ప్రవేశించడం ఒక నిశ్శబ్ద విప్లవం. అచ్చుకావడం, పాఠకులను చేరడం అనే ప్రక్రియల్లో అంతర్భాగమైన ఆలస్యం, దూరం, నిరక్షరాస్యత అనే మూడు పరిమితులను రేడియో ఒక్కసారిగా దాటేసింది. ఫలితంగా పత్రికా యాజమాన్యాలకు కంటగింపు మొదలై, కట్టడి ఆరంభమైంది. అప్పటికి దినపత్రికలంటే సాయంకాల దిన పత్రికలే! పత్రికలు వెలువడి, పాఠకులకు చేరి, వారు చదివిన తర్వాతే.. అంటే సాయంకాలం ఏడు గంటల తర్వాతే రేడియో వార్తలు ఇచ్చేది. పత్రిక, రేడియో మాధ్యమాల మధ్య ఈ పెనుగులాట రెండవ ప్రపంచ యుద్ధం దాకా కొనసాగింది. ఇది ఒక్క బ్రిటన్ అనుభవం మాత్రమే కాదు. చాలా దేశాల చరిత్ర. ప్రస్తుతం ఈ సంగతి తెలుసుకోవడం ఆశ్చర్యంగా ఉంటుంది. రాజకీయాల్లో పెద్దల దన్ను, దాదాగిరి ఎంత సహజమో? మీడియా సామ్రాజ్యవాదం కూడా అంతే సహజం!

పాతికేళ్ల క్రితం మన దేశపు జర్నలిజంలోకి ప్రయివేట్ టెలివిజన్ వినోద రంగం నుంచి ప్రవేశించింది. న్యూస్ టెలివిజన్ రాకతో పత్రికా యాజమాన్యాలు, పత్రికా సంపాదకులు ఉలిక్కిపడి విమర్శలు గుప్పించారు. అటువంటి వాదాలు నేటికీ అడపాదడపా వినబడుతుంటాయి. టెలివిజన్ మాధ్యమం మేధావుల మాధ్యమం కాదని వీరి వాదం. అయితే అటు యాజమాన్యాలు ఇటు సంపాదకవర్గాలు న్యూస్ చానళ్లలోకి ప్రవేశించడమే కాదు. కీలక స్థానాలను కూడా ఆక్రమించారు.

ఇక్కడ ఇంకో ముచ్చట చెప్పాలి. టెలివిజన్ వచ్చేదాకా మీడియా అంటే పత్రికారంగమే! కానీ పిమ్మట దృశ్యం మారిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అనే విభజన మొదలైంది. నేడు మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా అని పరిగణించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కంప్యూటర్ రావడంతో ఎలక్ట్రానిక్ రూపంలో అచ్చు పత్రికను పోలిన ఇమేజెస్‌ను ‘ఇ పేపర్లు’గా చదువుకునే వెసులుబాటు కలిగింది. ఇది ఎలక్ట్రానిక్ మీడియానా? ప్రింట్ మీడియానా? రెండింటికీ అవునూ అనీ, కాదూ అనీ జవాబు చెప్పొచ్చు. అందుకే దీనిని ‘న్యూ మీడియా’ అని పేర్కొన్నారు.

ఉదయం నుంచీ మధ్యాహ్నం దాకా న్యూస్ చానళ్ళు పత్రికలను తరిమితే, మధ్యాహ్నం నుంచి పత్రికలను చానళ్లు ఉరకలు పెట్టిస్తాయని భావించడం నిన్నటి వరకూ వాస్తవం. నేడు రెండింటినీ పరుగులు పెట్టిస్తోంది సోషల్ మీడియా. టెలివిజన్ ఆధిపత్యానికి అవలీలగా గండికొట్టింది సోషల్ మీడియా.

టెలివిజన్ రిమోట్‌తో వీక్షకులు చానళ్లు మార్చడమే తప్ప చూడటం లేదు అనే విమర్శ ఉంది. సులువుగా చానల్ మార్చగలగడంతో ముందుకొచ్చిన సమస్య ఇది. సోషల్ మీడియా అలా కాకుండా అరచేతిలో నీకేమి కావాలో నీవు చూసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ సౌలభ్యమే సోషల్ మీడియా విజయపాచిక. అంతకు మించి లైసెన్సు, టెక్నాలజీ, పెట్టుబడి, సిబ్బంది లేకుండా సమాంతరగళం వినిపించే, సమాంతర దృశ్యాల్ని చూపించే వేదికను సోషల్ మీడియా కల్పించింది. అందువల్ల పత్రిక, టెలివిజన్ ఆధిపత్యాన్ని దెబ్బతీయగలిగే సదుపాయం ఈ ప్రపంచానికి ఈ సమయంలో అవసరమైన గొప్ప ఊరట. ప్రశ్నలకు దొరకని ప్రముఖులూ, పరీక్షలు ఎదుర్కోని సంస్థలూ సోషల్ మీడియాను చూసి బెదిరిపోవడంలో ఆశ్చర్యం లేదు. మరో విషయం కూడా గమనించాలి– సోషల్ మీడియాలో చదువరి, వీక్షకుడు, జర్నలిస్టు, వార్తాంశాల యజమాని ఒకరే! టెలివిజన్ చానల్‌కు ఫుటేజీ, వాయిస్ బైట్‌ పంపితే సిటిజన్ జర్నలిజం. ఇలా స్వీకరించిన వార్తాంశాలను గమనించి, అవసరమైతే కత్తిరించి చానల్లో ప్రసారం చేయవచ్చు. కానీ సోషల్ మీడియా ఒకే వ్యక్తి మీడియా వినియోగదారుడు, ఉత్పత్తిదారుడు, నియంత్రించే వ్యక్తి!

మన దేశపు మీడియా గురించి రెండు విషయాలను కీలకంగా భావించాలి. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఉజ్వలమైన చరిత్ర భారతదేశపు పత్రికా రంగానిది. స్వాతంత్య్రోద్యమంతో ముడిపడిన భారతీయ పత్రికారంగం దేశవాసులందరినీ కలపడంలోనూ, వారిని ప్రగతిశీల దారుల్లో నడిపించడంలోనూ గొప్ప పాత్ర పోషించింది. టెలివిజన్ రంగం మాత్రం ప్రపంచీకరణతో ప్రాణం పోసుకుని విస్తరించింది. ఇక్కడ వాణిజ్యమే ఊపిరి. మిగతా అంతా ఊక, ఉబుసుపోక! అందుకే టెలివిజన్ తెరపై రక్తికట్టిన వాణిజ్య చమత్కారాలు నేటికీ పత్రికల్లో రసాభాస అవుతున్నాయి. డెబ్బయ్యేళ్ల క్రితపు విలువలు నేటి మీడియా రంగంలో వెతికి భంగపడుతున్న వ్యక్తులకు కొదవ లేదు. ఒకే సంస్థకు ఒకే చోట నుంచి పత్రిక ప్రచురణను, చానల్ ప్రసారాన్ని అమెరికా వంటి దేశాల్లో కూడా అనుమతించరు. దీనిని క్రాస్ మీడియా రెగ్యులేషన్ అంటారు. అలాంటి నియమాలు రూపుదిద్దుకోక ముందే మన దేశపు ఎలక్ట్రానిక్ మీడియాలో విస్ఫోటనం సంభవించింది. నేడు సోషల్ మీడియాకు సంకెళ్లు అవసరమని కొందరు వాదిస్తూ, కొన్ని కారణాలు చూపిస్తున్నారు. నేడు ఏ మీడియా కూడా సేవ కాదు. ఫక్తు వాణిజ్యం, వ్యాప్తి, లాభార్జన ధ్యేయం. అయితే దీనిని బాహాటంగా చెప్పుకోకుండా లాఘవంగా తప్పుకుంటారు. మీడియా అంటే వాణిజ్యమే కాదు. అధికారం, రాజకీయం కూడా! కనుకనే పార్టీలకు చానళ్లున్నాయి. ముందు ముందు మీడియా సంస్థలకు పార్టీలు వచ్చినా ఆశ్చర్యపోకూడదు!

ఇంత పరిణామశీలం గల, ప్రభావవంతమైన మీడియాను ఎలా అధ్యయనం చేయాలి? ఒక పరిణామాన్నీ, దాని ప్రభావాలను గమనించే లోపు మరిన్ని పరిణామాలు ముందుకొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీడియాపై సమగ్ర అవగాహన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ద్వారా లభిస్తుందా? మీడియా సంస్థల శిక్షణాకాలంలో దక్కుతుందా? చాలా మౌలికమైన ప్రణాళికలో సాగే విశ్వవిద్యాలయ కోర్సు ప్రయోజనం పరిమితం. ఇక మీడియా సంస్థలో ఇచ్చే శిక్షణలు ఆ సంస్థ అవసరాలు, దృక్పథాల్ని బట్టి ఉంటాయి కానీ, సమాంతర వాదాలు కానీ, సమగ్రమైన అవగాహన కానీ సాధ్యం కావు. అందుకే నిజమైన జర్నలిస్టులు ఏకలవ్యులుగా ముందుకు సాగాలి. కనుకనే ఎక్కువ అపజయాలు, తక్కువ సంఖ్యలో అపురూప విజయాలు ఎదురవుతాయి.

మరి మీడియా పాండిత్యం, నైపుణ్యం ఎలా సాధ్యపడతాయి? మీడియాని పరిశీలించడమే ఏకైక అధ్యయన మార్గం! వందల సంఖ్యలో పత్రికలు, చానళ్లు ఉన్నప్పుడు, వీటికి మించి సోషల్ మీడియా విజృంభిస్తున్నప్పుడు మీడియా పరిశీలన ఎలా సాధ్యం? ఇది సాధ్యపడే విషయం కాదు పూర్తిగా! కానీ ఇదే ఏకైక మార్గం. దీనికి కొంత ఊతంగా తోడ్పడేవి మీడియా గురించి వెలువడిన పుస్తకాలు. పాతికేళ్ల క్రితం ఇలాంటి పుస్తకాలు అపురూపం కానీ, ఇటీవల ఏన్నో రకాల మీడియా గ్రంథాలు వెలువడ్డాయి. ఇంగ్లీషుతో పోలిస్తే తెలుగులో మీడియా గ్రంథాలు తక్కువే కావొచ్చు. కానీ వైవిధ్యం లేకపోలేదు.

– నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు