‘అవినీతిని సహించేది లేదు’

22 June, 2019 - 7:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: పోలవరం తనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు అని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇంజినీరింగ్‌ పనుల పునఃసమీక్షకు నియమించిన ఉన్నతస్థాయి కమిటీతో శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. పోలవరం టాప్ ప్రియారిటీ అని స్పష్టం చేశారు.

ఇతర ప్రాజెక్టుల కంటే.. పోలవరం ప్రాజెక్టు పనులను …. క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఈ సందర్భంగా అధికారులను వైయస్ జగన్ ఆదేశించారు. అలాగే ప్రాధాన్య క్రమంలో హంద్రీనీవా, గాలేరు, నగరి, వెలిగొండల ప్రాజెక్టులను సైతం సమీక్షించాలని వారికి సూచించారు. అదేవిధంగా వరద సీజన్ ముగిసిన వెంటనే పోలవరంలో పనులు చేపట్టాలని .. అలాగే ఈ ప్రాజెక్టు సైతం సమీక్షించాలని ఆదేశించారు.

ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని ఉన్నతాధికారులకు వైయస్ జగన్ స్పష్టం చేశారు. టెండర్ల విధానాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించాలని వారికి మార్గనిర్దేశం చేశారు. చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడానికి తాను తపిస్తున్నట్లు ఈ సందర్బంగా వైయస్ జగన్ వెల్లడించారు.

అందుకే అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం తీవ్ర నష్టాల్లో ఉందని.. అవినీతి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైయస్ జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్‌కు ఎక్కడ అవకాశం ఉందో గుర్తించాలని అధికారులకు వైయస్ జగన్ సూచించారు.

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందరగోళం చేసిందని విమర్శించారు. ఇప్పుడు భారీగా వరద వస్తే 4 నెలల పాటు పనులు సాగవని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు.