1 నుంచి 6 వరకే ఇంగ్లీషు మీడియం

09 November, 2019 - 11:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఇంగ్లీషు మీడియం బోధనకు సంబంధించి సీఎం జగన్ తాజాగా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో మొదటి దశలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ మాత్రమే ఇంగ్లీషు మీడియాన్ని వర్తింపచేయాలని ఆదేశాలు జారీచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపిన సీఎం పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగు కోసం పలు నిర్ణయాలను ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతానికి ఇంగ్లీషు మీడియం బోధించేందుకు పూర్తిస్థాయి సన్నద్ధత లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఈ నెల14 నుంచి ప్రారంభమయ్యే నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషకు చెందిన ప్రయోగశాల ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విధానాలను పాటించాలని సూచించారు. 1 నుంచి 6 తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు పాఠశాలల్లో తగిన ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆయన చెప్పారు.