నాలుగిటిలో ‘ఒక్కటే’ ఫలితం

13 May, 2019 - 8:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ప్రధాని మోదీ మాటల్లో ఓటమి నైరాశ్యం కనబడుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో బీజేపీ ఓటమి ఖాయమైందని.. మోదీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో దేశాన్ని విభజించి.. పాలించే చరిత్ర మోదీదీ అని చంద్రబాబు అభివర్ణించారు. దేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధానిగా మోదీ మిగిలిరారన్నారు.

మోదీ వైఫల్యాలను టైమ్ మ్యాగజైన్‌లో వచ్చిన కథనం ఎత్తిచూపిందని చెప్పారు. మంచికీ మారు పేరు తెలుగుదేశం పార్టీ అయితే.. దుర్మార్గాలకు మారు పేరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అని చంద్రబాబు అభివర్ణించారు. ఓటమి ఖాయమని వైయస్ఆర్ పార్టీకి తెలిసి కూడా బుకాయిస్తుందన్నారు. గత ఎన్నికల్లోను ఇలాగే ఆ పార్టీ నేతలు నాటకాలు ఆడారని చంద్రబాబు గుర్తు చేశారు.

టీడీపీ విజయం తథ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. మే 23న ఓట్ల లెక్కింపులో గెలుపు లాంఛనమే అని ఆయన పేర్కొన్నారు. నాలుగు రకాల సర్వేలు చేయించామని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఆ సర్వేలన్నింటిలో టీడీపీ గెలుపు స్పష్టంగా వచ్చిందన్నారు.

వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని .. ఎన్నికల్లో పోటీ చేయడం ఒక్కటే కాదని.. రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాలను అధ్యాయనం చేయాలని శ్రేణులకు సూచించారు. సోమవారం అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్ లో నంద్యాల, కర్నూలు నియోజకవర్గ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. పోలింగ్ రోజు ఎన్నికల సరళి, అలాగే కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి .. చంద్రబాబు వారికి స్పష్టంగా వివరించారు. కర్నూలు జిల్లాలని రెండు ఎంపీ సీట్లు సైకిల్‌కే అని చెప్పారు.