చంద్రబాబు అను నేను…!

13 September, 2017 - 11:29 AM

 (న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నదుల సంరక్షణలో ఏపీని ఆదర్శంగా నిలబెడతామని  సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ర్యాలీ ఫర్ రివర్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేసి చరిత్ర సృష్టించామన్నారు.భూగర్భ జలాలను కాపాడుకోవడానికి ఇప్పటికే వేలకొద్దీ చెరువులు తవ్వామని, ఈ దిశగా పంటకుంటలు కూడా తమవంతు పాత్రను పోషిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. అలాగే నీటి సంరక్షణకు చాలా చర్యలు చేపట్టామని, నీటి సంరక్షణకు 57,587 చెక్‌డ్యాంలు 6.20 లక్షల ఫాం పాండ్స్‌ నిర్మించామని సీఎం అన్నారు. కోటి ఎకరాల్లో పండ్లతోటు పెంచుతామని ..మరో కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ పద్ధతులు అవలంభించాల్సి ఉందని తెలిపారు. చెప్పారు.భూగర్భ జలాల పెంపునకు పెద్ద ఎత్తున ఇంకుడుగుంతలు తవ్వామని చంద్రబాబు అన్నారు.

నదులను అనుసంధానించడం ద్వారా తాత్కాలిక ప్రయోజనాలు తీరతాయే తప్ప, దీర్ఘకాలిక ప్రయోజనాలుండవని చంద్రబాబు అన్నారు. రాయలసీమలో 19 నదులు, కోస్తాలో 20 నదులు ఉన్నాయని, వాటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో నదుల పరిరక్షణ కోసం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. చంద్రబాబు అను నేను, సకల జీవరాసుల మనుగడకు జలరాసులే ప్రాణాధారమని గుర్తించి, ప్రతి నీటి బిందువును, నా ఆత్మ బంధువుగా భావించి, నీటిని పొదుపుగా వాడుతానని, భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ, కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” థ్యాంక్యూ, ధన్యవాదాలు అంటూ ప్రసంగాన్ని ముగించారు.