సినిమా టికెట్ ధరలకు రెక్కలు…!

06 January, 2018 - 11:49 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలకు రెక్కలు రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి థియేటర్లకు అనుమతినిస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అన్ని తరగతుల ప్రతిపాదిత టికెట్ల ధరల సమాచారం సంబంధిత యంత్రాంగానికి ఇవ్వాలని స్పష్టం చేసింది. ధరల పెంపుపై ప్రభుత్వాలు కమిటీలు ఏర్పాటు చేసి ఈ వ్యవహారం తేల్చేంత వరకు పెంచిన ధరలు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. పెంపును సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ధరల నిష్పత్తిలో పన్ను చెల్లించాలని థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీ భట్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కోర్టు విధించిన షరతులను యాజమాన్యాలు అమలు చేస్తున్నాయో లేదో జాయింట్‌ కలెక్టర్లు పర్యవేక్షించాలని, సంబంధిత నివేదికను తమ ముందుంచాలని స్పష్టం చేశారు.

ధరల పెంపుపై ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, నిర్ణయం తీసుకునే వరకు ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలంటూ పలు థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటిషన్లు చేయగా, కోర్టు వాటిని విచారించి ఈ ఆదేశాలు జారీ చేసింది. కోర్టులో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టికెట్‌ ధరల సవరణపై 2013లో ప్రభుత్వం జీవో 100ను జారీ చేయగా హైకోర్టు కొట్టేసిందన్నారు. ధరలను నిర్ణయించేందుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శుల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించిందని వివరించారు. 2017 మార్చి 30 లోపు ధరలపై మార్గదర్శకాలు రూపొందించాలని తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని.. కాబట్టి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే వరకు టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరారు. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పెంపుపై నిర్ణయం తీసుకునేంత వరకూ పెంచిన ధరలను వసూలు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది.

ఈ తీర్పు వల్ల థియేటర్లు తమ ఇష్టారాజ్యంగా టికెట్లు పెంచేసుకోవడానికి వీలవుతుంది. మేం ఇలా పెంచుకున్నాం అని వారు ప్రభుత్వానికి ఒకమాట చెబితే సరిపోతుంది. తాము పెంచుకున్న ధరలకు తగినట్లుగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల సగటు సినీ ప్రేక్షకుడి నడ్డివిరిగేలా ధరలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలకంటె.. భారీగా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

సినిమా టిక్కెట్ ధరలు ఇక మీదట తెలుగు రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే తమ థియేటర్లలో టిక్కెట్ ధరను పెంచుకునే అధికారాన్ని థియేటర్ యజమానులకే కట్టబెట్టేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దీనివల్ల ఒక్కో థియేటర్‌లో ఒక్కో రకమైన రేట్లు వచ్చే అవకాశం ఉంది. సినిమా భారీ సినిమానా.. మామూలు సినిమానా అనే దానిని బట్టి.. దాని ప్రదర్శన హక్కుల కోసం ఎంత మొత్తం వెచ్చించాం అనే దానిని బట్టి.. థియేటర్ యజమానులు టిక్కెట్ ధరలను నిర్ణయించుకుంటే.. ఆ మేరకు వారు లాభపడిపోతారు. అయితే, పెద్ద సినిమాలకు వారు టిక్కెట్ ధరలను భారీగా పెంచేస్తే గనుక.. మొత్తంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది.