కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నిర్మాత బండ్ల గణేష్

14 September, 2018 - 12:10 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: సినిమా నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్‌‌కు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గణేష్ పోటీస్తారని తెలుస్తోంది. షాద్‌‌నగర్ నియోజకవర్గం నుంచి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. గణేష్‌తో పాటుగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, అదే పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

అనంతరం బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో త్యాగాలు చేసిందన్నారు. తనకు కాంగ్రెస్‌ అంటే ఇష్టమని అందుకే పార్టీలో చేరానన్నారు. రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏది చెబితే అది చేస్తానని, వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయమని రాహుల్ గాంధీ ఆదేశిస్తే అక్కడి నుంచి చేస్తానని తెలిపారు. లేదంటే ప్రచారం మాత్రమే చేస్తానని పేర్కొన్నారు. తాను జూబ్లీహిల్స్ టిక్కెట్‌ కోరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తానని గణేష్ తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ తనకు తండ్రి, గురువు లాంటి వారని, కానీ చిన్నప్పట్నుంచీ కాంగ్రెస్‌‌పై ఉన్న ఇష్టంతోనే పార్టీలో చేరానన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయాలన్నది తన కోరిక అని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరినందుకు ఆనందంగా, గర్వంగా ఉందన్నారు.ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేయడానికే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌‌పై తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.