వివేకా కేసు నిగ్గుతేల్చేందుకు అమిత్‌గార్గ్

15 March, 2019 - 5:17 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని పోస్టుమార్టంలో తేలడంతో ఈ కేసులో నిగ్గు తేల్చేందుకు సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో ప్రత్యేక విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సత్వర దర్యాప్తు కోసం మొత్తం ఐదు బృందాలను ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియమించారు. ఇప్పటికే విజయవాడ నుంచి మూడు ప్రత్యేక బృందాలను సంఘటన స్థలానికి పంపించారు. ఈ బృందాలన్నింటినీ సమన్వయం చేసే బాధ్యతను రాష్ట్ర సీఐడీ విభాగం అదనపు డీజీ అమిత్ గార్గ్‌కు అప్పగించినట్టు డీజీపీ తెలిపారు.

కాగా.. వివేకానందరెడ్డి హత్యోదంతంలో క్లూస్ టీమ్ ఆయన గదిలో కొన్ని వేలిముద్రలు, పాదముద్రలు సేకరించినట్టు కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. తాము సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సమయంలో ఇంటి వెనుక తలుపు తెరిచే ఉందని చెప్పారు. వెనుక తలుపు నుంచి ఎవరైనా ప్రవేశించే అవకాశం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. రాత్రి 11.30 నుంచి ఉదయం 5 గంటల మధ్యలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వివేకా హత్య రాత్రి 11.30 ప్రాంతంలో జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, ఇంటికి ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ మరిన్ని ఆధారాల కోసం శోధిస్తోందని వెల్లడించారు.

ఇలా ఉండగా.. వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డి హత్యకేసులో దోషులకు ఈ హత్యతో సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకాను హత్య చేసింది సుధాకర్‌రెడ్డి అనే అనుమానాలు వస్తున్నాయి. రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్‌రెడ్డి ఏ-8 నిందితుడు.