చిరు చిన్నల్లుడు అవయవ దానం!

11 February, 2019 - 4:27 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కల్యాణ్ దేవ్ తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు తన అంగీకార పత్రాన్ని అపోలో ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు.

ఈ రోజు కోసమే తాను ఎదురుచూస్తున్నానని కల్యాణ్ దేవ్ అన్నారు. ‘ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నాను. ట్విట్టర్‌‌లో ఉండటం సులువే కానీ ఏదన్నా విలువైన అంశంతో ఈ ట్విట్టర్ ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకున్నాను. అందుకే నా వంతుగా అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో అవయవదానం చేయడానికి ప్రతిజ్ఞ చేశాను. ఎంతైనా మనం పోయేటప్పుడు ఏమీ తీసుకుపోం కదా.. ప్రేమతో మీ కల్యాణ్‌ దేవ్‌’ అని పేర్కొంటూ ఫొటోలను పోస్ట్‌ చేశారు.

‘విజేత’ మూవీతో కల్యాణ్‌ దేవ్ హీరోగా టాలీవుడ్‌‌కు పరిచయమయ్యారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకుంది. కల్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా లుక్‌‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ లుక్‌‌లో కల్యాణ్ దేవ్ సంతోషంతో స్టెప్పులేస్తున్నట్లు ఉంది.