‘ఛలో’ ప్రీ రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా చిరు!

14 January, 2018 - 6:02 PM

నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఛలో’. వెంకీ కుడుముల ఈ మూవీ దర్శకుడు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే..’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. పాటను 50 లక్షల మందికిపైగా వీక్షించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఛలో’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఫిబ్రవరి 2న ‘ఛలో’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యథిక థియేటర్లలో గ్రాండ్‏‎‌‌గా రిలీజ్ చేయనున్నారు.

ఇలా ఉండగా.. ఛలో సినిమా ప్రీ-రిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారట. ఈ విషయాన్ని నాగశౌర్య సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘జనవరి 25న ఛలో ప్రీ-రిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవిని ఆహ్వానించాం. ఆయన ఒప్పుకోవడం, భోగి పండుగ సందర్భంగా ఈ విషయం ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నా ఆనందానికి అవధుల్లేవు. థ్యాంక్యూ సో మచ్ సర్‌’ అని ఆయన ఫేస్‌‌బుక్‌‌లో నాగశౌర్య రాశాడు. ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి దిగిన సెల్ఫీని కూడా షేర్‌ చేశాడు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ‘ఛలో’ ఫస్ట్‎లుక్, టీజర్, సాంగ్స్‎ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ నెల 25న ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌‎లో వినూత్నంగా నిర్వహించాలని ప్లాన్ చేశాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌‎గా రానున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా ఛోలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‎కు వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అద్భుతంగా వచ్చాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‎‌తో ఈ విషయం అర్థమై ఉంటుంది. అద్భుతమైన విజువల్స్ అందించారు. నాగశౌర్య పెర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఎనర్జిటిక్‎‌గా ఉంటుంది. తన కెరీర్లో పర్‎‌ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాం. హీరోయిన్ రష్మిక మండన్న, నాగశౌర్య మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం’ అన్నారు.

మరోపక్క నాగశౌర్య ‘కణం’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. సాయి పల్లవి కథానాయిక. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. నాగశౌర్య తొలి తమిళ చిత్రం ఇది కావడం గమనార్హం.

‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’, ‘దిక్కులు చూడ‌కు రామ‌య్య’, ‘ల‌క్ష్మిరావే మా ఇంటికి’, ‘క‌ళ్యాణ‌ వైభోగం’, ‘జ్యో అచ్యుతానంద’ లాంటి విభిన్న క‌థాంశాల‌తో విజ‌యాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌‌లో నాగశౌర్య ప్రత్యేక స్థానం సంపాదించాడు.