రాజ్‌కుమార్ మ‌ృతి

15 February, 2020 - 7:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు గుడిపాటి రాజ్‌కుమార్ శనివారం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. మెగా సార్ట్ చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు. ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు రాజ్ కుమార్. గత కొంత కాలంగా రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. ఆయన్ని అపోలో ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స ఇప్పించారు. అయితే రాజ్ కుమార్ పెద్ద కుమారుడు మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య కూడా మరణించింది.

దీంతో ఆయన ఒంటరి జీవితం అనుభవించాల్సి వచ్చింది. ఆయన స్వస్థలం. కృష్ణాజిల్లా ఉయ్యూరు. ఆయన పార్థీవదేహాన్ని ఉయ్యూరు తరలించేందుకు రాజ్ కుమార్ చిన్నకుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్ కుమార్ మరణవార్త విని మెగాసార్ట్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కొలుకుని.. మళ్లీ తనను కలుస్తారని ఆశించానని తెలిపారు. తనకు పునాదిరాళ్లు చిత్రంతో హీరోగా పునాది వేసిన రాజ్ కుమార్ మరణం తనకు తీరని లోటన్నారు.రాజ్ కుమార్ దర్శకత్వంలో 7 చిత్రాలు తెరకెక్కాయి. అందులో సమాజం నాకొద్దు, మనవూరి గాంధీ, మా సిరిమల్లె తదితర చిత్రాలు ఉన్నాయి. పునాదిరాళ్లు చిత్రానికి ఐదు నంది పురస్కారలు వచ్చిన విషయం తెలిసిందే.