‘యస్వీఆర్‌’ కోసం చిరు..

23 August, 2019 - 8:47 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఎన్నార్ రెండు కళ్లు అయితే.. విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు గండెకాయ లాంటివారని అభివర్ణించారు పలువురు ప్రముఖులు. తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పోయిన ఈ మహానటుడు ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరించనున్నారు.

ఆగస్ట్ 25వ తేదీ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని కేఎన్ రోడ్డులోని యస్.వి.ఆర్. సర్కిల్‌లో ఈ ఎస్వీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన తాడేపల్లి గూడెం చేరుకుంటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చిరంజీవి ప్రసంగిస్తారు.

ఎస్. వి. రంగారావు అసలు పేరు.. సామర్ల వెంకట రంగారావు. 1918, జులై 3న ఆయన కృష్ణాజిల్లా నూజివీడులో జన్మించారు. చదువుకునే రోజుల్లో ఆయనకు నటనపై మక్కువతో నాటకాల్లో నటించారు. ఆ అనుభవంతోనే ఎస్వీఆర్ సినీనటుడు అయ్యారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత కొద్ది రోజుల పాటు అగ్నిమాపక శాఖలో కోలువు చేశారు. ఆ తర్వాత ఆయన నటనపై పూర్తిగా దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగానికి రాజీనామా చేసి.. నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో వరూధిని చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. దాంతో మళ్లీ ఆయన ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత మళ్లీ ఆయనకు వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు వెల్లువెత్తాయి.

అంతే ఇంకా ఎస్వీఆర్ .. తన నటనతో సగటు ప్రేక్షకుడిని ఎస్వీఆర్.. మైమరిపింప చేశారు. ఆ క్రమంలో ఆయన చేసిన ప్రతి పాత్రలో లీనమై నటించేవారు. దాంతో కొద్ది కాలంలోనే ఆయన మహానటుడిగా అందరిమన్ననలు అందుకున్నారు. ఎస్వీఆర్ దాదాపు ఐదు భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. పాతాళ భైరవిలో నేపాలి మాంత్రికుడు, మాయబజార్‌లో ఘటోత్కచుడు, నర్తనశాలలో కీచకుడి పాత్రలో ఎస్వీ రంగారావు ఒదిగిపోయి నటించారు. అందుకే ఎస్వీఆర్.. మహానటుడు అయ్యారు. 1974లో ఎస్వీఆర్ మరణించారు.