‘సైరా’కు యు/ఏ సర్టిఫికేట్!

23 September, 2019 - 8:16 PM

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున విడుదలకు రెడీగా ఉంది. సైరా మూవీకి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్‌ బోర్డు సభ్యులు ఒక్క కట్ కూడా చెప్పకుండా సైరా సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ మంజూరు చేశారు. ఒక్క కట్ కూడా చెప్పకుండా సర్టిఫికెట్‌ను సొంతం చేసుకోవడం సైరా మూవీ విశేషం. విడుదలకు వారం రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం మరో విశేషం. భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మించారు.

చిరంజీవి కెరియర్లోనే తొలి చారిత్రక చిత్రంగా ‘సైరా’ అత్యధిక బడ్జెట్‌తో నిర్మాణం పూర్తి చేసుకుంది. దేశంలోని వివిధ భాషలకు సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ రూపుదిద్దుకుంది. సైరా నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రను బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పోషించారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో తమన్నా.. అనుష్క ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి సహా తెలుగు.. తమిళ భాషల్లోని పలువురు నటీనటులు ఇందులో నటించారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.కాగా.. సైరా మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఆదివారంనాడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ఎస్.ఎస్. రాజమౌళి, వివి వినాయక్‌, కొరటాల శివ లాంటి ఎంతో మంది ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సక్సెస్‌ చేశారు.