ఎట్టకేలకు చింతమనేని అరెస్ట్!

11 September, 2019 - 5:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

దుగ్గిరాల (ప.గో. జిల్లా): దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దళితులను దూషించి.. దౌర్జన్యం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న చింతమనేని పన్నెండు రోజులుగా పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య చింతమనేని బుధవారం ఉదయం దుగ్గిరాలలోని తన ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో చింతమనేని అనుచరులు రెచ్చిపోయారు. చింతమనేని నివాసంలో ఆరుగురు మహిళా కానిస్టేబుళ్లను అనుచరులు నిర్బంధించారు. ఈ క్రమంలో దుగ్గిరాలలో భారీగా మొహరించిన పోలీసులు చింతమనేని అరెస్టు చేశారు.

పినకడిమి గ్రామానికి చెందిన దళిత యువకులపై దాడి ఘటనలో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసే కాకుండా పలు అక్రమాలు, దౌర్జన్యాలకు సంబంధించి చింతమనేనిపై పోలీసులు పది కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా.. చింతమనేని ప్రభాకర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళుతున్న పోలీస్ వాహనాన్ని గోపన్నపాలెం వద్ద ఆయన అనుచరులు అడ్డగించారు. ఈ సందర్భంగా పోలీసులకు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో చింతమనేనిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయనను రహస్య ప్రాంతానికి తరలించారు. ఆయనను ఎక్కడకి తరలించారనే విషయం తెలియాల్సి ఉంది.

తనపై అక్రమ కేసులు పెట్టిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ప్రతి మనిషికీ ఒక నీతి ఉంటుందని.. ఏ ధర్మం ప్రకారం పోలీసులు తనపై ఇన్ని అక్రమ కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఎందుకు తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని అడిగారు. తన మనుషులు, కార్యకర్తల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తన ఇంట్లోని విలువైన వస్తువులను కూడా పోలీసులు పగలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఇబ్బందిపెట్టారని మండిపడ్డారు. పోలీసులు తనను బలవంతంగా అరెస్ట్ చేసిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు. తనను రెచ్చగొట్టారని, ఏ విచారణకైనా తాను సిద్ధమని చింతమనేని అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణకు చింతమనేని సవాల్ విసిరారు. చింతమనేని తప్పు చేయలేదా? అని బొత్స అన్నారని.. తాను తప్పు చేసినట్టు బొత్స నిరూపిస్తే తన తండ్రి ఆస్తిని, తన ఆస్తిని పేదలకు దానం చేస్తానని, రుజువు చేయలేకపోతే మంత్రి పదవికి బొత్స రాజీనామా చేస్తారా? అంటూ ఛాలెంజ్ చేశారు. తనపై మెజిస్టీరియల్ విచారణ కూడా అవసరం లేదని, గ్రామసభ పెట్టి తాను తప్పు చేసినట్టు నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమే అన్నారు. తప్పుడు కేసులు పెట్టి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపైన చింతమనేని సెటైర్లు వేశారు. విజయసాయిరెడ్డి మమ్మల్ని దొంగలంటున్నారని.. ఆయనేమో దొరట అని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి మీద ఉన్నన్ని కేసులు మరెవరి మీదా లేవని అన్నారు. తాను బయటకు వస్తున్నట్టు ముందే ప్రకటించానని, కానీ.. తనను పట్టుకుంటున్నట్టు పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. 12 పోలీసు బృందాలను పెట్టినా 14 రోజుల పాటు తనను ఎవరూ పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.